పిల్ల కాలువా తవ్వించలేని వ్యక్తి.. నీటిపారుదల మంత్రా?

జగన్‌ ప్రభుత్వానికి ‘ఎక్స్‌పైరీ డేట్‌’ దగ్గర పడిందని, ప్రజలు ఆయనకిచ్చిన సమయం అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని, తొమ్మిది నెలల తర్వాత అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 10 Jun 2023 07:06 IST

గనుల దోపిడీదారు.. మైనింగ్‌ మంత్రి
పట్టుమని పదిళ్లూ కట్టలేని.. గృహనిర్మాణ శాఖామాత్యుడు
కోడిగుడ్డు కథ చెప్పే.. పరిశ్రమల మంత్రి
జగన్‌ను కేసుల నుంచి  తప్పించేందుకు యాగాలు చేయించే దేవాదాయ మంత్రి
రైతుబజార్‌నూ తాకట్టు పెట్టిన అప్పుల శాఖామాత్యుడు
చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వానికి ‘ఎక్స్‌పైరీ డేట్‌’ దగ్గర పడిందని, ప్రజలు ఆయనకిచ్చిన సమయం అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని, తొమ్మిది నెలల తర్వాత అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సామాజిక మాధ్యమ విభాగం ఐటీడీపీ సభ్యుల అభినందన సభలో ఆయన ప్రసంగించారు. ‘మంత్రులు చాలా దారుణంగా తయారయ్యారు. ఎక్కడ గనులున్నా కొట్టేసే వ్యక్తి మైనింగ్‌ మంత్రి. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకునే వ్యక్తి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి. సొంత నియోజకవర్గంలో పిల్ల కాలువ కూడా  తవ్వించలేని గొప్ప నాయకుడేమో నీటిపారుదల శాఖ మంత్రి. నియోజకవర్గంలో తన పదవీకాలంలో పట్టుమని పది ఇళ్లు కట్టలేని నాయకుడు గృహ నిర్మాణశాఖ మంత్రి. పరిశ్రమల గురించి చెప్పమంటే కోడిగుడ్డు కథ చెప్పే నాయకుడు ఆ శాఖకు మంత్రి. కోర్టులో జగన్‌కు మేలు జరగాలని, వివేకా హత్య కేసు నుంచి తప్పించుకోవాలని పూజలు చేసే నాయకుడు దేవాదాయశాఖ మంత్రి. ఏం మంత్రండీ మీరు? భగవంతుడికి భక్తులిచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి.. చెప్పులు కూడా తీయకుండా హోమానికి వెళ్లే వ్యక్తి కోసం ఇవన్నీ చేస్తారా? ప్రతి మతానికి, జాతికి సంప్రదాయాలు, కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదు. ఆర్థిక శాఖకు మంత్రి నిజానికి అప్పుల శాఖకే అమాత్యుడు. తెల్లారి లేస్తే ఏది తాకట్టు పెట్టాలా అని ఆలోచించడమే ఆయన పని. చివరకు రైతుబజార్‌ను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనత ఆయనదే. పిల్లల జీవితాల్ని నాశనం చేసిన వ్యక్తి విద్యా శాఖ మంత్రి’ అని చంద్రబాబు మంత్రులపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు.

నేను చేసిన అభివృద్ధి పోలవరాన్ని అడగండి

‘మంత్రులకు ప్రెస్‌మీట్‌ పెట్టమని ఉదయమే ఆదేశాలు వస్తాయి. ‘సాక్షి’ నుంచి నోట్‌ వస్తుంది. దాన్ని బట్టీపట్టి తూచా తప్పకుండా చదివేస్తారు. వారి ప్రెస్‌మీట్‌లో సగం నన్ను తిట్టడానికి, మరో సగం తెదేపా హయాంలో ఏమీ చేయలేదని చెప్పడానికే సరిపోతుంది. నేనేం చేశానో, ఏం చేయలేదో హైదరాబాద్‌ నగరాన్ని చూస్తే, పోలవరం ప్రాజెక్టును అడిగితే, అమరావతిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. హైదరాబాద్‌కు దీటుగా ఆంధ్రప్రదేశ్‌కు ఆధునిక నగరాన్ని నిర్మించాలని అమరావతిని పరుగులు పెట్టించాం. ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చాక.. అమరావతి నిర్మాణం ఆపేశారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

సీఎంకు సభ్యత, సంస్కారం ఉన్నాయా?

‘హజ్‌ యాత్రికులు అల్లాకి అతిథులుగా వెళుతున్నారు కాబట్టి, వారిని కలసి ఆశీర్వచనం తీసుకోవడానికి నేను కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను. ముఖ్యమంత్రికి సభ్యత, సంస్కారం ఉంటే అది పూర్తయ్యాక వెళ్లాలి. కానీ నా కార్యక్రమాన్ని రద్దు చేయించి వెళ్లారు. దాన్ని వివాదం చేయడం ఇష్టం లేక... ఆయన తిరిగి వెళ్లాకే నేను వెళ్లాను. హజ్‌ యాత్రికులంతా చాలా సంతోషించారు. హైదరాబాద్‌లో నేను హజ్‌హౌస్‌ కట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ హజ్‌హౌస్‌ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, నేను అధికారంలోకి రాగానే కట్టాలని కోరారు. తప్పకుండా కడతామన్నాను. తెదేపా అధికారంలో ఉండగా హజ్‌ హౌస్‌ నిర్మాణానికి రూ.145 కోట్లు మంజూరు చేసి, శంకుస్థాపన కూడా చేశాం. వైకాపా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి ఉంటే.. హజ్‌ యాత్రికులను నంబూరులోని ఒక మదర్సాలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవండి!

ఐటీడీపీ చాలా వేగంగా, సమర్థంగా పని చేస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. ‘సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు. 21 లక్షల సభ్యత్వాలు పూర్తి చేశారు. మహానాడులో మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేస్తే.. నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ దాన్ని చేరవేయడంతో, అందరూ తెదేపాకు జేజేలు కొట్టే పరిస్థితి వచ్చింది. ఐడీడీపీలోని 32 వేల మంది వారి సెల్‌ఫోన్లకు పనిపెట్టి.. వైకాపా ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలపై సృజనాత్మకంగా కంటెంట్‌ సృష్టించి, ప్రజల్లో చర్చనీయాంశం చేయాలి. వైకాపాలో చాలా మంది జోకర్లే. సమాజాన్ని అతలాకుతలం చేసి, పైశాచికానందం పొందే వ్యక్తులే. వాళ్ల గురించి ప్రచారం చేయడానికి మీకు కావాల్సినంత విషయం ఉంది. మీరు ఎంతగా సృజనాత్మకత పెంచుకుంటే ప్రజల్ని అంతగా ప్రభావితం చేస్తారు. యుద్ధానికి ఇక తొమ్మిది నెలలే ఉంది. అన్ని అస్త్రాలూ సిద్ధం చేయండి’ అని సూచించారు. పార్టీ కార్యక్రమాల్ని సామాజిక మాధ్యమాల్లో వేగంగా ప్రజలకు చేరవేస్తున్న, ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టులు పెడుతున్న, ఐదు వేలకు మించి సభ్యత్వాలు నమోదు చేయించిన 600 మంది ఐటీడీపీ సభ్యుల్ని చంద్రబాబు చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, రవి వేమూరి, చింతకాయల విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.


అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిద్దాం
ఐకాస నాయకులకు చంద్రబాబు భరోసా

తుళ్లూరు, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెదేపా విజయం సాధిస్తుందని, అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిద్దామని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చినట్లు ఐకాస నాయకులు తెలిపారు. మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో అమరావతి రైతు ఐకాస నాయకులు చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజధాని అమరావతిలో ప్రస్తుత పరిణామాలు, ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసి సెంటు భూములు పంపిణీ చేయడం, మట్టి దందాలు, ఉద్యమకారులపై పోలీసుల అక్రమ కేసులు, తదితర విషయాలను చంద్రబాబుకు వివరించారు. కార్యక్రమంలో అమరావతి దళిత ఐకాస నాయకుడు పులి చిన్నా, పువ్వాడ సుధాకర్‌, ధనేకుల రామారావు, ఆకుల జయసత్య, గౌర్నేని స్వరాజ్యరావు, బెల్లంకొండ నరసింహారావు, ఆలూరి శ్రీనివాసరావు, మాదల వాసు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని