యూత్‌ జోడో.. బూత్‌ జోడో

యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గం మూడు రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశాలు శుక్రవారం ముగిశాయి.

Updated : 10 Jun 2023 06:40 IST

యువతకు చేరువయ్యేందుకు యువజన కాంగ్రెస్‌ కొత్త కార్యక్రమం

ఈనాడు, హైదరాబాద్‌: యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గం మూడు రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి, తీర్మానాలు చేశారు. యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘‘రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా ప్రజలకు చేరువ కావాలి. అందులో భాగంగా ‘యూత్‌ జోడో... బూత్‌(పోలింగ్‌ కేంద్రం) జోడో’ పేరిట దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని యువతకు కాంగ్రెస్‌ సిద్ధాంతాలను వివరించాలి. హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో నెగ్గినట్లుగానే తెలంగాణలోనూ విజయం కోసం గట్టిగా కృషి చేయాలి. బునియాద్‌ యువ సమ్మేళన్‌, యూత్‌ కనెక్ట్‌ ప్రోగ్రాం, ఏక్‌ బూత్‌.. పాంచ్‌ యూత్‌’ అనే నినాదాలతో గ్రామగ్రామాన తిరగాలి’’ అని తీర్మానించామన్నారు. యువజన కాంగ్రెస్‌ జాతీయ ఇన్‌ఛార్జి కృష్ణ ఆళ్వార్‌ మాట్లాడుతూ... దేశ నలుమూలలకు వెళ్లి కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయాలని, అన్ని మాధ్యమాలనూ ఉపయోగించుకోవాలని తీర్మానించినట్లు వివరించారు.


రాష్ట్ర కాంగ్రెస్‌కు ఇద్దరు కొత్త ఏఐసీసీ కార్యదర్శులు

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్తగా ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులను నియమించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు మన్సూర్‌ అలీఖాన్‌ (కర్ణాటక), పీసీ విష్ణునాథ్‌(కేరళ) రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేకు సహాయకులుగా పనిచేస్తారన్నారు. ఇంతకాలం వీరి స్థానంలో పనిచేసిన ఎన్‌.ఎస్‌.బోసురాజు, నదీం జావెద్‌లను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశామన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గడంతో బోసురాజు అక్కడ మంత్రిగా నియమితులైన విషయం తెలిసిందే. కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న విష్ణునాథ్‌ను అక్కడ ఎన్నికలు ముగియడంతో తెలంగాణకు మార్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని