చస్తే చస్తారంటూ ఎస్సై దురుసు వ్యాఖ్యలు

తమ మండలానికి కేటాయించిన 108 వాహనం టైర్లు తరచూ ఊడిపోతున్నాయని, బాధితులు సమయానికి ఆసుపత్రులకు వెళ్లలేక చనిపోతున్నారని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం తెదేపా నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు.

Published : 10 Jun 2023 04:52 IST

తరచూ టైరు ఊడి 108 సేవలందక జనం చనిపోతున్నారని తెదేపా ఆందోళన

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: తమ మండలానికి కేటాయించిన 108 వాహనం టైర్లు తరచూ ఊడిపోతున్నాయని, బాధితులు సమయానికి ఆసుపత్రులకు వెళ్లలేక చనిపోతున్నారని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం తెదేపా నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. ప్రజల సమస్యను పరిష్కరించాలని టైరు ఊడిన వాహనం వద్ద బైఠాయించడంతో అక్కడికి వచ్చిన ఎస్సై వెంకటేశ్వరరావు ఆవేశంతో ‘మిమ్మల్ని అరెస్టు చేస్తా.. నాలుగేళ్లు కోర్టుకు తిరగాల్సి వస్తుంద’ంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వాహనం సరిలేక చనిపోతున్నారండీ అంటూ నాయకులు వివరించగా చస్తే.. చస్తారని ఎస్సై అనడంతో నాయకులు మండిపడ్డారు. వాగ్వాదానికి దిగుతూ ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రిక్తత నెలకొంది. నాయకులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఉదయం గ్రామాలనుంచి గర్భిణులను స్థానిక పీహెచ్‌సీకి తీసుకువచ్చేందుకు బయలుదేరిన 108 వాహనం ఉప్పలగుప్తం ప్రధాన కూడలిలో చక్రం ఊడి రహదారి మధ్యలో ఆగింది. మధ్యాహ్నం కావస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన ఎస్సై వెంకటేశ్వరరావు నాయకులను తప్పుకోవాలని హెచ్చరించారు. ఆ నేపథ్యంలో వాగ్వాదమేర్పడింది. దీనిపై 108 అంబులెన్సు కోఆర్డినేటర్‌ సుబ్రహ్మణ్యం వివరణ కోరగా వారంలో మరో వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు