Raghurama: ‘ఆగస్టులో ఏపీ అసెంబ్లీ రద్దు.. తెలంగాణతోపాటే ఎన్నికలు’!

శ్రీకాళహస్తి సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను బట్టి ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదని, అందువల్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టులో అసెంబ్లీ రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వైకాపా ఎంపీ కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Updated : 12 Jun 2023 08:23 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: శ్రీకాళహస్తి సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను బట్టి ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదని, అందువల్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టులో అసెంబ్లీ రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వైకాపా ఎంపీ కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అప్పు పుట్టకపోతే ఒక్కరోజు కూడా జగన్‌ ప్రభుత్వాన్ని నడపలేరని, అందువల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఆదివారం దిల్లీలోని తన నివాసంలో రఘురామ విలేకర్లతో మాట్లాడారు. ‘ముందస్తు ఎన్నికల కోసమే ప్రభుత్వం భారీగా దొంగ ఓట్లు నమోదు చేయిస్తోంది. గుంటూరు, విశాఖపట్నంలో బయటపడ్డ ఉదంతాలే అందుకు ఉదాహరణ. వైకాపా సానుభూతిపరుల ఇళ్లలో కొత్త ఓట్లు నమోదు చేయిస్తూ, తెదేపా, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను పరిశీలించాలి. ఓటర్లు కూడా తమ పేర్లు జాబితాలో పరిశీలించుకోవాలి’ అని సూచించారు.

ముందస్తు ఎన్నికలు లేవని తమ పార్టీ నాయకత్వం ప్రతిపక్షాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ లోగా పెద్దఎత్తున దొంగ ఓట్లు నమోదు చేసి అసెంబ్లీని రద్దు చేయాలన్నది ఎత్తుగడ అని పేర్కొన్నారు. అసెంబ్లీ రద్దయ్యాక ఓటరు నమోదు ప్రక్రియలో గందరగోళం నెలకొనే అవకాశముందన్నారు. ‘కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదికల ఆధారంగానే నడ్డా ఏపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై మాట్లాడారు. దానికి బదులివ్వాల్సింది పోయి, నడ్డాను వ్యక్తిగతంగా దూషించడం మాజీ మంత్రి పేర్ని నానికి తగదు. కర్ణాటక ప్రజలు భాజపాను తిరస్కరిస్తే అక్కడి డీజీపీని దిల్లీకి తీసుకెళ్లి సీబీఐ డైరెక్టర్‌ చేశారని, సీబీఐ ఎలా పనిచేస్తుందో తెలిసిదేనంటూ నాని విమర్శించడం విస్మయం కలిగిస్తోంది. నాలుగేళ్లుగా జగన్‌ కోర్టుకు హాజరు కాకపోయినా సీబీఐ మౌనంగానే ఉంది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు కోర్టు ఎలా చెబితే అలా నడుచుకుంటామని చెప్పి సీబీఐ పరోక్షంగా సహకరించింది. వివేకా హత్య కేసులోనూ అవినాష్‌రెడ్డి పట్ల ఉదాసీనంగా ఉంది. అలాంటి సీబీఐపై విమర్శలు చేసి, ఆగ్రహం తెప్పిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాని గుర్తించాల’ని రఘురామ హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని