Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి రాజ్యసభలో చుక్కెదురు

రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో ‘ఇండియాస్‌ గ్లోరియస్‌ స్పేస్‌ జర్నీ మార్క్‌డ్‌ బై సక్సెస్‌ఫుల్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఆఫ్‌ చంద్రయాన్‌-3’ అన్న అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ చంద్రబాబు గురించి మాట్లాడారు.

Updated : 21 Sep 2023 07:51 IST

చంద్రబాబుపై ఆరోపణలు.. వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యులు
వాటిని అరాచకపార్టీలుగా అభివర్ణించిన వైకాపా నేత

ఈనాడు, దిల్లీ: రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో ‘ఇండియాస్‌ గ్లోరియస్‌ స్పేస్‌ జర్నీ మార్క్‌డ్‌ బై సక్సెస్‌ఫుల్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఆఫ్‌ చంద్రయాన్‌-3’ అన్న అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ చంద్రబాబు గురించి మాట్లాడారు. ‘‘దేశంలో తాము ఎన్నో చేసినట్లు కాంగ్రెస్‌, భాజపా చెప్పుకొంటుండగా మధ్యలో మా రాష్ట్ర ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు వచ్చి సైన్స్‌కి తానెంతో చేసినట్లు ప్రకటించుకుంటున్నారు. ఎన్నోసార్లు ఆయన తానే కంప్యూటర్‌ను తయారుచేసినట్లు, అంతరిక్ష పరిశోధనకు తానే ఆద్యుడినని, సెల్‌ఫోన్‌ను తానే కనిపెట్టినట్లు ప్రకటించుకున్నారు’’ అని పేర్కొన్నారు.

దాంతో ఆ సమయంలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, భారాస సభాపక్ష నాయకుడు కె.కేశవరావు అడ్డుపడగా మీ మాట నేను వినదలచుకోలేదు, దయచేసి కూర్చోమని విజయసాయిరెడ్డి గద్దించారు. డీఎంకే సభాపక్ష నేత తిరుచ్చి శివ లేచి అభ్యంతరం వ్యక్తం చేయగా తన ప్రసంగానికి అడ్డుపడే హక్కు మీకు లేదంటూ ఆయనపైనా ఆగ్రహం వ్యక్తంచేసి, ప్రసంగాన్ని కొనసాగించారు. చంద్రబాబు నిజంగా అన్నీ కనిపెట్టారా అన్న విషయాన్ని మీరు విచారించి కనిపెట్టాలని వ్యాఖ్యానించారు. ఐటీ, కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ను ఆయన కనిపెట్టింది నిజమైతే భారత్‌ దానిపై పేటెంట్‌ హక్కులు కోరొచ్చన్నారు. ఆ పేటెంట్‌ హక్కుల కింద బిలియన్ల రూపాయలు పొందొచ్చని వ్యంగ్యంగా అన్నారు.

ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు విజయసాయి ప్రసంగానికి అడ్డుతగులుతూ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తగా మొత్తం ప్రతిపక్షం అరాచకంగా వ్యవహరిస్తోందని వారిపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌ అరాచక పార్టీ అని, మిగిలిన ప్రతిపక్షాలు వారితో చేరి దేశాన్ని అరాచకంగా మార్చాయని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే సహా మిగిలిన ప్రతిపక్షపార్టీల సభ్యులంతా లేచి అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో విజయసాయిరెడ్డి చంద్రబాబు గురించి చెప్పకుండా తనను అడ్డుకోలేరన్నారు. ఈ పార్టీలన్నీ అరాచకపార్టీలని, దేశంలో అలజడి సృష్టించడానికే అవి ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏవైనా అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న మమతా మొహంత హామీ ఇచ్చారు. చివరగా విజయసాయిరెడ్డి ప్రసంగం ముగించిన తర్వాత వామపక్ష సభ్యుడొకరు ‘‘బెయిల్‌ మీద ఉన్న నాయకుడు... జైల్లో ఉన్న నాయకుడిని ప్రశ్నిస్తున్నారు’’ (లీడర్‌ ఆన్‌ బెయిల్‌... క్వశ్చనింగ్‌ ది లీడర్‌ ఇన్‌ జైల్‌) అంటూ విజయసాయిరెడ్డిపై వ్యంగ్యాస్త్రం సంధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు