చంద్రబాబు అరెస్టుపై దద్దరిల్లిన అసెంబ్లీ
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై శాసనసభ దద్దరిల్లింది. గురువారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే... తెదేపా సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలని తెదేపా సభ్యుల డిమాండ్
స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తీవ్ర స్థాయిలో నిరసన
తెదేపా సభ్యులతో కలసి నిరసనలో పాల్గొన్న శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి
తెదేపా సభ్యులతోపాటు, ఇద్దరు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఈనాడు, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై శాసనసభ దద్దరిల్లింది. గురువారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే... తెదేపా సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు. చంద్రబాబుపై అక్రమంగా పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ‘చంద్రబాబుపై కక్షసాధింపుతో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి’, ‘ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం’, ‘సైకో జగన్ డౌన్ డౌన్’.. నినాదాలతో తెదేపా సభ్యులు సభను హోరెత్తించారు. వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తెదేపా సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైకాపా, తెదేపా సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో తెదేపా సభ్యులపైకి వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆయన వెంట పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కసారిగా దూసుకు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం పతాకస్థాయికి చేరింది. అసాధారణ రీతిలో, భారీ సంఖ్యలో మోహరించిన మార్షల్స్... తెదేపా, వైకాపా సభ్యుల మధ్య అడ్డుగోడగా నిలబడి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిలువరించారు. శ్రీధర్‌రెడ్డితో పాటు, ఇద్దరు తెదేపా సభ్యుల్ని ఈ సమావేశాలు ముగిసేంతవరకు, నిరసనలో పాల్గొన్న మిగతా తెదేపా సభ్యులతో పాటు, శ్రీదేవిని గురువారం ఒక్క రోజు సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం బహిష్కరించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై చర్చకు డోలా బాలవీరాంజనేయస్వామి తదితర తెదేపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
స్పీకర్ పోడియం వద్ద తీవ్ర స్థాయిలో నిరసన
గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం మొదలైన వెంటనే తెదేపా సభ్యులు నిరసన చేపట్టారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్‌లో నిలబడగా, మిగతా సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు స్పీకర్ టేబుల్‌పై ఉన్న కాయితాలను చించి గాల్లోకి విసిరారు. ఆ క్రమంలో వారి చేయి తగిలి నీళ్లతో ఉన్న గ్లాసు టేబుల్‌పై పడిపోయి, కాగితాలు తడిసిపోయాయి. సభాపతి అసహనం వ్యక్తం చేస్తూనే సభను కొనసాగించారు. శ్రీధర్‌రెడ్డి తదితరులు స్పీకర్ టేబుల్‌కి అమర్చిన మానిటర్‌ను లాగే ప్రయత్నం చేశారు. పోడియం పై నుంచి తెదేపా సభ్యుల నినాదాలు, కింద నుంచి వైకాపా సభ్యుల హేళనలు, వెక్కిరింతలతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ తెదేపా సభ్యులు సరియైన ఫార్మాట్‌లో వస్తే వారు డిమాండ్ చేస్తున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. అర్థంపర్థంలేని నోటీసు ఇచ్చి, పోడియంపైకి వచ్చి గొడవ చేయడం తెదేపా సభ్యులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయమని అడగాల్సింది కోర్టుల్లో
‘తెదేపా సభ్యుడు ఒకాయన మీ బల్లపై కొడుతున్నారు. నిజంగా చంద్రబాబుపై గౌరవం ఉంటే బల్ల కొట్టాల్సింది ఇక్కడ కాదు. న్యాయస్థానాల్లోకి వెళ్లి కొట్టమనండి. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయమని అడగాల్సింది ఇక్కడ కాదు. అక్రమ కేసులు ఎత్తివేయమని దిల్లీ నుంచి తీసుకొస్తున్న న్యాయవాదులతో హైకోర్టులోను. సుప్రీంకోర్టులోను, మఫిసిల్ కోర్టులోను వాదించుకోమనండి’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అప్పటికి సభలో గందరగోళం సద్దుమణగకపోవడంతో... స్పీకర్ సభను వాయిదా వేశారు.
వాటీజ్ దిస్.. యూజ్‌లెస్ ఫెలో అంటూ స్పీకర్ ఆగ్రహం
‘వాటీజ్‌దిస్ యూజ్‌లెస్‌ఫెలో... ఎవడురా చెప్పారు మీకు... వీడియోస్ ఆర్ ప్రొహిబిటెడ్... తీసుకెళ్లండి వాళ్లను’ అంటూ తెదేపా సభ్యులను ఉద్దేశించి స్పీకర్ సీతారాం ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెదేపా సభ్యులపైకి దూసుకెళ్లిన వైకాపా సభ్యులను ఉద్దేశించి... ‘ప్లీజ్ మనవాళ్లు వెనక్కి రండి.. వైఎస్సార్... ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ కంబ్యాక్’ అంటూ స్పీకర్ వ్యాఖ్యానించడం విశేషం. విరామం అనంతరం సభ మళ్లీ మొదలయ్యాక స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు ‘సైకో జగన్ డౌన్ డౌన్’ అంటూ మరింత ఉద్ధృతంగా నినాదాలు చేయసాగారు. అప్పటికి సీఎం జగన్ సభలోనే ఉన్నారు. ఈసారి తెదేపా సభ్యులు పోడియంపైకి వెళ్లకుండా పదుల సంఖ్యలో మార్షల్స్‌ని మోహరించారు. ఒక్క తెదేపా సభ్యురాలు ఆదిరెడ్డి భవానీకే ఆరేడుగురు మహిళా మార్షల్స్‌ని కాపలా పెట్టారు. ‘తెదేపా సభ్యులు సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాయితాలు విసిరేశారు. సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేసిన నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారు. మొదటి తప్పిదంగా భావించి ఆయనకు సభ తొలి హెచ్చరిక చేస్తోంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా సభ ఆయనను హెచ్చరిస్తోంది’ అని స్పీకర్ పేర్కొన్నారు. శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్ ఫైల్స్ చించివేయడం, మానిటర్‌ను పగలగొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారని, ఆ అంశాన్ని నైతిక విలువల కమిటీకి రిఫర్ చేస్తున్నామని తెలిపారు. సభ ఆస్తులకు నష్టం చేసిన సభ్యుల నుంచే వాటి విలువను రాబడతామని తెలిపారు. స్పీకర్ ప్రకటన చేస్తున్నప్పుడే... వెనుక వరుసలోంచి వైకాపా సభ్యుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డి... తెదేపా సభ్యులపైకి దూసుకెళ్లారు.
తెదేపా సభ్యుడు బెందాళం అశోక్ కూడా ముందుకు దూసుకురావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ వెంటనే మంత్రులు జోగి రమేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేరుగు నాగార్జున సహా పెద్ద సంఖ్యలో వైకాపా ఎమ్మెల్యేలు వారివైపు దూసుకెళ్లారు. అంబటి రాంబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాలకూ మధ్య మార్షల్స్ అడ్డుగోడగా నిలిచారు. ఒకపక్క ఆ గొడవ జరుగుతుండగానే... నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని బుగ్గన తీర్మానం ప్రవేశ పెట్టారు. శ్రీధర్‌రెడ్డి, సత్యప్రసాద్‌లను ప్రస్తుత సమావేశాల జరిగినంత కాలం, మిగతా తెదేపా సభ్యుల్ని, ఉండవల్లి శ్రీదేవిని గురువారం ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ మొదట ప్రకటించారు. తెదేపా సభ్యులపైకి దూసుకొస్తున్న మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల్ని.... తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్ వీడియో తీయడంపై వైకాపా సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆయనపైనా చర్య తీసుకోవాలని బుగ్గన సూచించడంతో... కేశవ్‌ను కూడా ప్రస్తుత సమావేశాలు జరిగినంత కాలం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయినవారిలో 16 మంది తెదేపా సభ్యులు, ఇద్దరు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు సభ నుంచి బయటకు వచ్చాక... స్పీకర్ ఛాంబర్ ముందు కొందరు వైకాపా సభ్యులకు వారికీ స్వల్ప వాగ్వాదం జరిగింది.
తెదేపా సభ్యుల వెంటే ఆ ముగ్గురు..
వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి... తెదేపా సభ్యులతో కలిసి సభలోకి వచ్చారు. అంతకు ముందు చంద్రబాబు అరెస్టుకి నిరసనగా ఫైర్ స్టేషన్ నుంచి తెదేపా సభ్యులతో కలసి వారు కూడా కాలినడకన అసెంబ్లీ వరకు చేరుకున్నారు. సభలో జరిగిన నిరసనలో మేకపాటి పాల్గొనలేదు.
మంత్రి అంబటి, బాలకృష్ణ ఢీ అంటే ఢీ..!
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ తెదేపా సభ్యుల తీరు ఇలాగే కొనసాగితే, వైకాపా సభ్యులూ రెచ్చిపోయే ప్రమాదం ఉందని, అవాంఛనీయ సంఘటనలు జరిగితే తెదేపా సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ సందర్భంగా పోడియంపై ఉన్న తెదేపా సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మంత్రి అంబటి మీసం తిప్పుతూ సవాళ్లు చేసుకున్నారు. ‘అధ్యక్షా బాలకృష్ణగారిని సినిమాల్లో చూపించమనండి. ఇక్కడ మీసాలు తిప్పడం కాదు’ అని అంబటి వ్యాఖ్యానించారు. ‘ఆగాగులే.. ఇక్కడ కాదు.. దమ్ముంటే రా’ అంటూ రెచ్చగొట్టారు. వైకాపా సభ్యుడు మధుసూదన్‌రెడ్డి తొడ కొట్టారు. ‘అధ్యక్షా... తెదేపా సభ్యులు మీపై దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. వారే అవాంఛనీయ ఘటనల్ని ఆహ్వానిస్తున్నారు. మా పార్టీలోంచి వెళ్లి ఆ పార్టీలో చేరిన సభ్యుడు (శ్రీధర్‌రెడ్డిని ఉద్దేశించి) మీ ముందుకు వచ్చి మానిటర్ లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఓవర్‌యాక్షన్ చేస్తున్నాడు. దాని వల్ల మా సభ్యులు ఆవేశకావేశాలకు లోనయ్యే అవకాశం, రెచ్చిపోయే ప్రమాదం ఉంది. మీపై భౌతిక దాడులకు (మ్యాన్ హ్యాండ్లింగ్) దిగాలన్న ఉద్దేశం తెదేపా సభ్యుల్లో కనిపిస్తోంది. వారిపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అంబటి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్‌లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ