గెలుపు గుర్రాల ఎంపికపై ఆచితూచి అడుగులు

శాసనసభ ఎన్నికల్లో పోటీకి దింపే తమ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపుగుర్రాలను గుర్తించేందుకు సుదీర్ఘ కసరత్తు చేస్తోంది.

Updated : 22 Sep 2023 06:55 IST

దిల్లీలో అర్ధరాత్రి వరకూ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ
నేడు, రేపూ కొనసాగనున్న సమావేశం
కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాపై స్పష్టత!

ఈనాడు, దిల్లీ: శాసనసభ ఎన్నికల్లో పోటీకి దింపే తమ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపుగుర్రాలను గుర్తించేందుకు సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రం దిల్లీ జీఆర్‌జీ రోడ్డులోని పార్టీ వార్‌రూంలో మురళీధరన్‌ అధ్యక్షతన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమైంది. సాయంత్రం అయిదు గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 12 గంటల వరకు కొనసాగింది. సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేష్‌ మేవానీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాస్కీ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శులు పీసీ విష్ణునాథ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, రోహిత్‌ చౌదరి, కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న, ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాల జాబితాను తయారు చేసి కేంద్ర స్క్రీనింగ్‌ కమిటీకి పంపాలని నిర్ణయించారు. ఈ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క(మధిర), సీతక్క(ములుగు), పొదెెం వీరయ్య(భద్రాచలం), శ్రీధర్‌బాబు(మంథని), జగ్గారెడ్డి(సంగారెడ్డి) పేర్లతోపాటు రేవంత్‌రెడ్డి(కొడంగల్‌), ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి(హుజూర్‌నగర్‌), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(నల్గొండ) తదితరుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితానే కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే... కొన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం, ఒకే అభ్యర్థి ఉన్నా... ఇంకా మెరుగైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకరికంటే ఎక్కువ ఆశావహులు పోటీ పడే నియోజకవర్గాలపై శుక్ర, శనివారాల్లో కొనసాగే భేటీల్లో నిర్ణయం తీసుకుంటారు. స్క్రీనింగ్‌ కమిటీ భేటీ నేపథ్యంలో కాంగ్రెస్‌ టికెట్లు ఆశిస్తున్న వారు దిల్లీలో మకాం వేశారు. కమిటీ సభ్యుల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమను నమ్ముకొన్న వారికి టికెట్లు ఇప్పించేందుకు మరికొందరు నేతలు దిల్లీకి వచ్చారు. బీసీ కోటాలో  సీట్లు ఇవ్వాలని పలువురు నాయకులు ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలను కలిసి విన్నవిస్తున్నారు.

మధు యాస్కీపై ఎల్బీనగర్‌ నేతల ఫిర్యాదు

దిల్లీలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ నేతలు కలిశారు. రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌, స్క్రీనింగ్‌ కమిటీలో సభ్యుడైన మధు యాస్కీకి తమ నియోజకవర్గం టికెట్‌ ఇవ్వవద్దని విన్నవించారు. ఆయన నిజామాబాద్‌కు రెండుసార్లు ఎంపీగా చేశారని, అక్కడే ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నం చేసుకోవాలని సీనియర్‌ నేతల వద్ద సూచించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని