అరెస్టు కక్షసాధింపు చర్యే

తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులు డిమాండ్‌ చేశారు.

Updated : 23 Sep 2023 06:23 IST

ఏపీ ప్రభుత్వంపై కూనంనేని, ఎమ్మెల్యే వనమా విమర్శ

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొత్తగూడెంలో పార్టీలకు అతీతంగా అభిమానులు శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి మార్కెట్‌ యార్డు నుంచి కొత్తగూడెంలోని ప్రకాశం మైదానం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో ‘బాబు కోసం.. మేము సైతం’ అంటూ అభిమానులు నినదించారు. తెదేపాతో పాటు భారాస, కాంగ్రెస్‌ నాయకులు, సింగరేణి కార్మికులు హాజరై బాబుకు సంఘీభావం తెలిపారు. కూనంనేని మాట్లాడుతూ.. విజన్‌ ఉన్న నాయకుణ్ని జైల్లో పెట్టి అవినీతిపరులు రాజ్యమేలుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెదేపాను ఎదుర్కొనే సత్తా లేకే ఏపీలో అధికార పార్టీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందన్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ, భారాస నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని), బిక్కసాని నాగేశ్వరరావు, కొత్తగూడెం జడ్పీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని