కమలంతో కుదిరిన దళ్‌ దోస్తీ!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్‌డీయేలో తాము భాగమవుతున్నట్లు జనతాదళ్‌ (సెక్యులర్‌) ప్రకటించింది.

Published : 23 Sep 2023 05:19 IST

ఎన్‌డీయేలో భాగమైన జేడీఎస్‌
స్వయంగా ప్రకటించిన దేవేగౌడ

ఈనాడు, బెంగళూరు/దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్‌డీయేలో తాము భాగమవుతున్నట్లు జనతాదళ్‌ (సెక్యులర్‌) ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ శుక్రవారం దిల్లీలో ఈ విషయం స్వయంగా ప్రకటించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పొత్తు ఖరారుపై ఇదే సందర్భంగా చర్చించారు. దిల్లీలోని అమిత్‌ షా ఇంట్లో 45 నిమిషాలసేపు ఈ భేటీ జరిగింది. చర్చల అనంతరం జేపీ నడ్డా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘‘పార్టీ సీనియర్‌ నాయకులు అమిత్‌ షా సమక్షంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చించాం. ఎన్‌డీయేలో భాగస్వామి అయ్యేందుకు జేడీఎస్‌ తీసుకున్న నిర్ణయం హర్షదాయకం. జేడీఎస్‌ను హృదయపూర్వకంగా ఎన్‌డీయేలోకి ఆహ్వానిస్తున్నాం’’ అని ప్రకటించారు. జేడీఎస్‌ చేరికతో ఎన్‌డీయే మరింత శక్తిమంతం అవుతుందని అమిత్‌ షా సంతోషం వ్యక్తం చేశారు. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈరోజు ఎన్డీయేలో మేము అధికారికంగా చేరాం. కర్ణాటకలో అవినీతికి పాల్పడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్‌ను ఓడించేందుకు చేతులు కలిపాం’’ అన్నారు.  

 దసరా తర్వాత సీట్ల పంపకం..

అక్టోబరులో జరగనున్న దసరా పండగ తర్వాత లోక్‌సభ సీట్ల పంపకం గురించి భాజపా, జేడీఎస్‌ ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని తమ పార్టీ నేతలతో చర్చించాక భాజపా ఈ విషయలో ఒక నిర్ణయానికి రానుంది. ‘‘సీట్ల పంపకం పెద్ద విషయం కాదు. ఉభయులం సానుకూలంగానే ఉన్నాం. ఆ అంశాన్ని పరిష్కరించుకుంటాం’’ అని కుమారస్వామి తెలిపారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. జేడీఎస్‌ 6 నుంచి 8 స్థానాలు అడుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, భాజపా 3 లేదా 4 స్థానాలు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని