లోక్‌సభలో విద్వేష వ్యాఖ్యల దుమారం

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వేళ లోక్‌సభలో భాజపా సభ్యుడొకరు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

Updated : 23 Sep 2023 05:37 IST

బీఎస్పీ ఎంపీ దానిశ్‌ అలీపై భాజపా సభ్యుడు రమేశ్‌ బిధూడీ అనుచిత ప్రవర్తన
తీవ్రంగా ఖండించిన ప్రతిపక్షాలు
బిధూడీపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆగ్రహం
షోకాజ్‌ నోటీసు జారీ చేసిన కమలం పార్టీ

దిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వేళ లోక్‌సభలో భాజపా సభ్యుడొకరు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రయాన్‌-3 విజయంపై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ, మైనారిటీ వర్గానికి చెందిన కున్వర్‌ దానిశ్‌ అలీపై భాజపా ఎంపీ రమేశ్‌ బిధూడీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వీటిని కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి పార్టీలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఆయన్ను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి.

లోక్‌సభలో గురువారం రాత్రి చంద్రయాన్‌-3 విజయంపై చర్చ జరుగుతున్న సమయంలో.. దక్షిణ దిల్లీకి చెందిన భాజపా ఎంపీ బిధూడీ.. దానిశ్‌ అలీని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమ పార్టీ ఎంపీ ప్రవర్తనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెంటనే విచారం వ్యక్తం చేశారు. బిధూడీ వ్యాఖ్యలను స్పీకర్‌ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం హెచ్చరించారు. బిధూడీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బిధూడీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘భాజపా ఎంపీ వ్యాఖ్యలు పార్లమెంటుకు, ఎంపీలందరికీ అవమానకరం. బిధూడీని తక్షణం లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌.. దానిశ్‌ అలీని కలసి సంఘీభావం ప్రకటించారు. 


చర్యలు తీసుకోకపోతే లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకుంటా..: దానిశ్‌ 

రమేశ్‌ బిధూడీ తనపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర కలత చెందినట్లు దానిశ్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రివిలేజెస్‌ కమిటీకి పంపి విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. అందులో బిధూడీ తనపై చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. మరోవైపు ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బిధూడీపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాను లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకోవడంపై యోచిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బిధూడీ చేసిన వ్యాఖ్యలను భాజపా అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ బిధూడీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. మరోవైపు లోక్‌సభలో బిధూడీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సమయంలో పక్కనే ఉన్న భాజపా ఎంపీలు హర్షవర్ధన్‌, రవిశంకర్‌ప్రసాద్‌ నవ్వుతూ కనిపించడం విమర్శలకు తావిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని