జగన్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

తెదేపా అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కు తీసుకోవాలని, అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు.

Updated : 23 Sep 2023 06:23 IST

చంద్రబాబుపై తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి
అసెంబ్లీ వరకు తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన ప్రదర్శన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కు తీసుకోవాలని, అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. కేవలం రాజకీయ కక్షసాధింపుతోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మందడం ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన చేశారు. ‘అరాచక ప్రభుత్వం నశించాలి’, ‘ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. నిరసనలో తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాలకృష్ణ, ఎమ్మెల్సీలు శ్రీకాంత్‌, పంచుమర్తి అనురాధ, వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


సభంతా సాక్షి పత్రిక, టీవీలకే అంకితమైంది
- ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

‘అసెంబ్లీ మొత్తం సాక్షి పత్రిక, టీవీలకే అంకితమైంది. స్పీకరే నాన్‌సెన్స్‌, న్యూసెన్స్‌ అంటుంటే.. మేమూ ఆయన్ను అలాగే అనాల్సి వస్తుంది. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఆయన వైకాపా పక్షం వహిస్తున్నారు. 200 మంది మార్షల్స్‌ను మాపై ప్రయోగించారు. 144 సెక్షన్‌, పోలీసు చట్టం, గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులను చేస్తూ సీఎం జగన్‌ పాలిస్తున్నారు’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని