ముగ్గురు తెదేపా ఎమ్మెల్సీల సస్పెన్షన్‌

‘‘పిచ్చి మాటలు మాట్లాడొద్దు.. ఏం ఒళ్లు తిమ్మిరి ఎక్కిందా’’ ఈ మాటలు మాట్లాడింది ఎవరో కాదు. సాక్షాత్తు రాష్ట్రానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.

Published : 23 Sep 2023 05:44 IST

మంత్రి అంబటి వివాదాస్పద వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ‘‘పిచ్చి మాటలు మాట్లాడొద్దు.. ఏం ఒళ్లు తిమ్మిరి ఎక్కిందా’’ ఈ మాటలు మాట్లాడింది ఎవరో కాదు. సాక్షాత్తు రాష్ట్రానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇదేదో బహిరంగ వేదికపై చేసిన దూషణలు కావు.. ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్సీలను ఉద్దేశించి శాసన మండలిలో మంత్రి శుక్రవారం ఇలా మాటల దాడి చేశారు. సభను వాయిదా వేసినట్లు ఛైర్మన్‌ ప్రకటించిన అనంతరం వెళ్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకింత ఉద్రిక్తతకు దారితీశాయి. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై న్యాయం కోరుతూ తెదేపా ఎమ్మెల్సీలు ఛైర్మన్‌ పోడియంలోకి చొచ్చుకువెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకోవటంతో మండలిలో రెండో రోజూ గందరగోళ వాతావరణమే నెలకొంది. వారికి పోటీగా వైకాపా ఎమ్మెల్సీలు చంద్రబాబు 420 అంటూ కేకలు వేయడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతిపక్ష ఎమ్మెల్సీల నిరసనలతో సభను ఛైర్మన్‌ పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి  రాకపోవటంతో తెదేపా ఎమ్మెల్సీలు శ్రీకాంత్‌ను   సమావేశాలు ముగిసే వరకు.. బి.టి.నాయుడు, పంచుమర్తి అనురాధలను ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. అనంతరం సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను మార్షల్స్‌ బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.

మండలి చరిత్రలో.. మొదటిసారి

తెదేపా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సభా కార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్నారన్న కారణంగా సెషన్స్‌ ముగిసే వరకు.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలపై ఒక్కరోజు సస్పెన్షన్‌ విధించాలని మంత్రి సురేష్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించిన తర్వాత ఛైర్మన్‌ మాట్లాడారు. ‘‘చాలా దురదృష్టకరం. కొత్తగా వచ్చిన సభ్యులు సభ సంప్రదాయాలు తెలుసుకోవాలి. హౌస్‌ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సభ్యులను సస్పెండ్‌ చేయడం విచారకరం’’ అని వ్యాఖ్యానించారు.

మాటల యుద్ధం

  • తెదేపా ఎమ్మెల్సీలు సభను బాయ్‌కాట్‌ చేసి బయటకు వెళ్తున్న సమయంలో వైకాపా ఎమ్మెల్సీలు ‘బైబై బాబు’ అంటూ నినాదాలు చేశారు. తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు వెనక్కు వచ్చి ‘సీ యూ’ అంటూ సమాధానం చెప్పి వెళ్లారు.
  • వైకాపా ఎమ్మెల్సీలు ‘చంద్రబాబు 420’ అని నినాదాలు చేయటంతో.. పోటీగా తెదేపా ఎమ్మెల్సీలు ‘సైకో సీఎం’ అని అన్నారు. దీంతో అంబటి ఆగ్రహంతో.. రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. 31 కేసులున్న జగన్‌ను ఏమనాలి? అంటూ తెదేపా ఎమ్మెల్సీ అనురాధ ఘాటుగా స్పందించారు.

సబ్‌ప్లాన్‌ నిధులతో బస్సులు తిప్పడమేంటి?

గిరిజన సంక్షేమంపై వైకాపా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి రాజన్నదొర సమాధానం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ‘‘ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను రవాణా శాఖ అధికారులు దారి మళ్లించారు. ఆ నిధులతో ఆర్టీసీ బస్సులు కొని.. వాటిని విశాఖలో తిప్పుతోంది. సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగమవుతుంటే పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అవి గిరిజన ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలి కదా’’ అని ప్రశ్నించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల కారణంగా గిరిజనులకు వేలాది ఎకరాల పంపిణీ నిలిచిపోయిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని