జీవోలో ఉన్నవి ఒప్పందంలో ఎందుకు లేవు?

‘‘ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో తొలుత జీవోలో ఇచ్చిన అంశాలు తర్వాత ఒప్పందంలో ఎందుకు చేర్చలేదు? చంద్రబాబు విధాన నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఆయనకు బాధ్యత ఏముంటుందని తెదేపా నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Published : 23 Sep 2023 05:44 IST

మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నలు

ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో తొలుత జీవోలో ఇచ్చిన అంశాలు తర్వాత ఒప్పందంలో ఎందుకు చేర్చలేదు? చంద్రబాబు విధాన నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఆయనకు బాధ్యత ఏముంటుందని తెదేపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయన బాధ్యత లేకుండానే ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయా?’’ అని మచిలీపట్నం ఎమ్మెల్యే (వైకాపా) పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో శుక్రవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటులో అవినీతిపై స్వల్పకాల చర్చ జరిగింది. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ జీవోలో సీమెన్స్‌ సంస్థ 90% గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇస్తుందన్నారని, ఒప్పందంలో ఆ విషయం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి పని చేయకుండానే రూ.371 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. సీఎం ఎక్కడా సంతకాలు పెట్టక్కర్లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెబుతారని, చంద్రబాబు ఇందులో 13 చోట్ల సంతకాలు చేశారని నాని అన్నారు. టెండర్లు పిలిచి అప్పజెప్పాల్సిన ఈ ప్రాజెక్టును నామినేషన్‌పై ఎందుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఆధారాలతో కేసు పెడితే కక్షసాధింపా?

‘‘తప్పిదాలు జరిగి కేసులు నమోదు చేస్తే అది రాజకీయ కక్షసాధింపు ఎందుకు అవుతుంది? ఇందులో అనేకమంది విచారణలో భాగంగా మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏం జరిగిందో చెప్పారు. సీఐడీ అనేక ఆధారాలతో చంద్రబాబుపై కేసు నమోదు చేస్తే ఆ పార్టీవారు కక్షసాధింపు అంటే ఎలా’’ అని కాకినాడ గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కె.కన్నబాబు ప్రశ్నించారు. ఇందులో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సి ఉందని, పాత్రధారులను అరెస్టుచేసి సూత్రధారులను అరెస్టు చేయవద్దా అని ప్రశ్నించారు. రూ.371 కోట్ల కార్యక్రమంలో అవినీతి అంటే చిన్న విషయం కాదని, అది చాలా పెద్ద మొత్తమని అన్నారు. అమరావతి భూముల కేసుతో పాటు ఇతర కుంభకోణాల్లోనూ దర్యాప్తు చేయాలని కన్నబాబు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని