ఉండవల్లీ.. ఇసుక, లిక్కర్‌ కుంభకోణాలు కనిపించవా?

మీరు అనేక ప్రెస్‌మీట్లలో మద్యం సీసాలు చూపించి, ఇది విషమని.. ఇందులో ఎంతో అవినీతి జరిగిందని చెప్పారు కదా.. దీనిపై విచారణకు పిటిషన్‌ వేయడానికి మీ పెన్ను ముందుకు కదల్లేదా?

Published : 23 Sep 2023 05:44 IST

స్కిల్‌ స్కీంపై ఎవరో రాసిన పిటిషన్‌పై మీరు సంతకం చేశారా?
మాజీ ఎంపీ అరుణ్‌కుమార్‌ను  ప్రశ్నించిన తెదేపా నేత పట్టాభి

మీరు అనేక ప్రెస్‌మీట్లలో మద్యం సీసాలు చూపించి, ఇది విషమని.. ఇందులో ఎంతో అవినీతి జరిగిందని చెప్పారు కదా.. దీనిపై విచారణకు పిటిషన్‌ వేయడానికి మీ పెన్ను ముందుకు కదల్లేదా? ఇసుకలో రూ.40 వేల కోట్ల కుంభకోణం జరుగుతుంటే.. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక్క రేవుకైనా వెళ్లి పరిశీలించేందుకు మీ కాళ్లు కదల్లేదా..? ఇసుక అక్రమాలపై సీబీఐ విచారణ కోరేందుకు మీ పెన్ను ముందుకెళ్లలేదా?’

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్‌: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నా, ఏ రోజూ న్యాయస్థానానికి కాగితం ముక్క రాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్షల మంది శిక్షణ పొంది, ఉద్యోగాలు చేస్తుంటే ఆ పథకంపై సీబీఐ విచారణకు పిటిషన్‌ వేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పేర్కొన్నారు. రాజమహేంద్రవరానికి శుక్రవారం వచ్చిన ఆయన కేంద్ర కారాగారం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, శాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్‌ అన్ని స్కాంలకు సాక్ష్యాధారాలున్నాయని.. ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్‌ ఒక డమ్మీ సంస్థ అని మీకు తెలియదా? అని నిలదీశారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్‌లో 44 మంది పేర్లు ప్రస్తావించిన ఉండవల్లి.. ప్రాజెక్టు అమలులో నిధుల విడుదల, ఖర్చు, నిర్ణయాలు తీసుకున్న అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నివేదిక ఇచ్చిన ఆడిట్‌ సంస్థ పేర్లను ఏ ఉద్దేశంతో చేర్చలేదని ప్రశ్నించారు. ఈ పథకం అమలులో ప్రతి రూపాయి చెల్లింపులు చేసిన ప్రేమచంద్రారెడ్డి, ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో ఉన్న షంషేర్‌సింగ్‌ రావత్‌, కార్పొరేషన్‌ ఏర్పాటుకు జీవోలు ఇచ్చిన నీలం సాహ్ని, అజయ్‌జైన్‌, నిధులు ఇచ్చిన అజేయ కల్లం పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. వీరందర్నీ కాకుండా ఏం తప్పు చేశారని చంద్రబాబు నాయుడి పేరు ఆ జాబితాలో ప్రస్తావించారని నిలదీశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోవాలనే సదుద్దేశం ఉంటే పూర్తి వివరాలు తాను పంపిస్తానని, అనాలోచితంగా ఇటువంటి పనులు చేయడం వల్ల కొన్ని లక్షల మంది యువతను రోడ్డున పడేస్తారనే అంశాన్ని గుర్తించాలని ఉండవల్లికి పట్టాభి హితవు పలికారు. మీకు ప్రజాధనంపై అంత ప్రేమ ఉంటే నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలపై సీబీఐ విచారణ కోరాలని సూచించారు.

జగన్‌కు నామోషీగా లేదా?

జగన్‌కు ధైర్యంగా వచ్చి కోర్టు బోనులో నిల్చోమనండి.. ఇన్ని సంవత్సరాలు బెయిల్‌పై గడపటానికి నామోషీగా లేదా? అంటూ పట్టాభి ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో లోకేశ్‌ బస ప్రాంతం వద్ద మాట్లాడారు. లోకేశ్‌ పారిపోయారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. నాలుగున్నరేళ్లుగా కోర్టుకు రాలేక, పారిపోతున్న వ్యక్తి జగన్‌ అని ఎద్దేవా చేశారు. సీబీఐ కేసుల్లో జగన్‌ను అనేక దఫాలు విచారించి.. సరైన సమాధానాలు చెప్పకపోతే అరెస్టు చేశారే తప్ప, ఎఫ్‌ఐఆర్‌ వేసిన వెంటనే చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. మీ తమ్ముడు అవినాశ్‌రెడ్డిని నేరుగా లాక్కెళ్లారా.. ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారా..? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టులో కనీస నిబంధనలు పాటించకుండా కక్షసాధింపు చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ద్వారా క్వాష్‌ పిటిషన్‌కు సానుకూల స్పందన వస్తుందని నమ్ముతున్నామన్నారు. యడియూరప్ప కేసులో చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ బెంచ్‌ ద్వారా ఆయనకు ఉపశమనం కలిగిన విషయాన్ని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని