జగన్‌ అవినీతిపై చర్చకు సిద్ధమా?

‘అయిదు రోజులపాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సీఎం జగన్‌ అవినీతి, కేసులు, వాటి విచారణ తీరు... తెదేపా అధినేత చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమా?’ అని ప్రభుత్వానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు.

Updated : 23 Sep 2023 06:24 IST

ప్రభుత్వానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సవాలు
మా మీద చేస్తున్న ఆరోపణల మీదా చర్చకు సిద్ధమే
ఉభయసభలనూ బహిష్కరించాలని నిర్ణయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘అయిదు రోజులపాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సీఎం జగన్‌ అవినీతి, కేసులు, వాటి విచారణ తీరు... తెదేపా అధినేత చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమా?’ అని ప్రభుత్వానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. అవసరమైతే తెదేపా అధినేత చంద్రబాబును ఒప్పించి సభకు తీసుకొస్తామని చెప్పారు. వీటికి స్థానిక, జాతీయ మీడియాను అనుమతించాలని, అప్పుడు ఎవరి బాగోతం ఏంటో ప్రజలకు తెలుస్తుందన్నారు. సభలో మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా సమావేశాలు ముగిసేవరకూ ఉభయసభలకు వెళ్లకూడదని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్టు వెల్లడించారు. అసెంబ్లీ నుంచి సస్పెండైన తర్వాత అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడారు. ‘‘నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి వైకాపా ఎమ్మెల్యేలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమకేసులు ఎత్తేయాలని, జగన్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుతూ మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. అందులో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చదవాల్సిన ఆయన.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మేం వాస్తవాలు చెప్పడానికి ప్రయతిస్తే మా మైకులు ఆపేస్తారు. సీఎం, మంత్రులు మాత్రం గంటలు గంటలు మాట్లాడుతూ.. చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడూ అర్థవంతమైన చర్చ జరిపింది లేదు’’ అని విమర్శించారు.

అధికార పార్టీ వీరంగాన్ని ప్రజలకు చూపించాలనే వీడియోలు తీశాం

‘‘సాక్షి సిబ్బందిని సభలోకి అనుమతించి, మేం మాట్లాడేది మాత్రమే చూపిస్తూ... వైకాపా సభ్యుల వీరంగాన్ని కప్పిపుచ్చుతున్నారు. సభలో జరిగేవి బయటకు తెలియకుండా స్పీకర్‌ కట్టడి చేస్తున్నారు. ఒక్క సాక్షి ఛానల్‌నే సభలోకి ఎలా అనుమతిస్తారు? మీడియా అంటే అదొక్కటేనా? 200 మంది మార్షల్స్‌ను మా సభ్యుల చుట్టూ గోడకట్టినట్టు పెట్టారు. ధైర్యముంటే సభలో జరిగే ప్రతి పరిణామాన్నీ ప్రత్యక్ష ప్రసారం చేయండి. మేం మాట్లాడేటప్పుడు ప్రకటనలు వేస్తూ... వైకాపా వాళ్లు మమ్మల్ని తిట్టేది మాత్రం ప్రసారం చేస్తున్నారు. అందుకే అక్కడ జరుగుతున్న వ్యవహారం సభ్యసమాజానికి తెలియజేయాలనే వీడియోలు తీశాం’’ అని అచ్చెన్న స్పష్టం చేశారు.

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌’ అన్నప్పుడే స్పీకర్‌పై గౌరవం పోయింది

‘‘అసెంబ్లీని వైకాపా కార్యాలయం కంటే దారుణంగా మార్చిన ఘనత స్పీకర్‌దే. మమ్మల్ని యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అని.. వైకాపా వాళ్లను మాత్రం ‘మన సభ్యులు’ అన్నారు. అప్పుడే స్పీకర్‌పై గౌరవం పోయింది. అలాంటి వ్యక్తి చెప్పేది మేమెందుకు వినాలి’’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని