ఇక వైకాపాను భాజపా పట్టించుకోనక్కర్లేదు

పార్లమెంట్‌ సమావేశాలు ముగిసినందున ఇక తమ పార్టీని కేంద్రంలోని భాజపా నాయకత్వం పట్టించుకోవాల్సిన పనిలేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Updated : 23 Sep 2023 07:05 IST

పార్లమెంటు సమావేశాలు ముగియడంతో ఆ అవసరం లేనట్లే
మద్యం ఆదాయంపై రూ. 40 వేల కోట్ల అప్పు: ఎంపీ రఘురామ

ఈనాడు, దిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు ముగిసినందున ఇక తమ పార్టీని కేంద్రంలోని భాజపా నాయకత్వం పట్టించుకోవాల్సిన పనిలేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. దానికి టీజర్‌ అన్నట్లుగానే నరసాపురంలోని ఒక మద్యం దుకాణాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆకస్మిక తనిఖీ చేసి అక్రమాలను తేల్చారన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి సీఎం జగన్‌ రూ.40 వేల కోట్ల అప్పులు చేశారు. ఎన్నికలకు ముందు దశలవారీగా మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. నరసాపురంలోని మద్యం దుకాణంలో ఎంత మద్యాన్ని విక్రయించారని షాపులో వారిని పురందేశ్వరి ప్రశ్నిస్తే రూ.లక్ష సరకు అమ్మినట్లు వారు చెప్పారు. రశీదు గురించి అడిగితే రూ.700కు మాత్రమే ఇచ్చామన్నారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంతటి అవినీతికి పాల్పడుతోందో తేల్చేశారు. రూ.లక్ష విలువైన మద్యాన్ని విక్రయించి కేవలం రూ.700 మద్యం విక్రయించినట్లుగా రశీదులు చూపెడుతున్నారంటే, ఎన్ని రూ.వేల కోట్లను జగన్‌, ఆయన బినామీలు జేబుల్లో వేసుకుంటున్నారో అర్థమవుతోంది. ఇలా అక్రమంగా కూడబెట్టిన  ఆదాయంతో రానున్న ఎన్నికల్లో ఓటుకు రూ.పది వేలు కాకపోతే రూ.20 వేలు ఇచ్చి వైకాపా కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న బ్రాండ్లలో హానికారక పదార్థాలు అధిక మోతాదులో ఉన్నాయి. గతంలో రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యాన్ని ల్యాబ్‌లో పరీక్షలు చేయగా ఈ విషయం బట్టబయలైంది’ అని రఘురామ విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని