38 కేసుల్లో ఏ1 బయట.. నిజాయతీపరుడు జైల్లో..

రూ.42 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి.. సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1గా ఉన్న సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉంటే.. ఏ తప్పూ చేయని చంద్రబాబు మాత్రం జైల్లో ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Published : 24 Sep 2023 04:37 IST

నిరసనలపై తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రూ.42 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి.. సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1గా ఉన్న సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉంటే.. ఏ తప్పూ చేయని చంద్రబాబు మాత్రం జైల్లో ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. జగన్‌కు బెయిల్‌ మంజూరై శనివారంతో పదేళ్లయిన సందర్భంగా ‘ఖైదీ నంబర్‌ 6093.. బెయిల్‌ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బాపట్ల మండలం కొత్తఓడరేవు సముద్ర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటుచేసిన వారిపై కేసు పెట్టడాన్ని లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే చివరికి అంతరిక్షం, సముద్రం, భూగర్భాల్లోనూ 144 సెక్షన్‌, పోలీసు యాక్టు 30 విధించేలా ఉందన్నారు. ‘శాంతియుత నిరసనలనూ అనుమతించవద్దని డీజీపీని సీఎం ఎందుకు ఆదేశించారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును మీరెలా కాదనగలరు? పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఏపీలో ఎందుకు? తెలంగాణలో లేని నిర్బంధాలు మన రాష్ట్రంలోనే ఎందుకు చేస్తున్నారో సైకో సర్కారు చెప్పాలి? ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని అక్రమ విధానాలతో అడ్డుకోలేరు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని