YS Jagan: జగన్‌రెడ్డి దోపిడీ @ రూ.3.58 లక్షల కోట్లు

జగన్‌రెడ్డి అధికారం చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత దోపిడీ పర్వాన్ని కొనసాగించారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

Updated : 26 Sep 2023 07:32 IST

తండ్రి వైఎస్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంది రూ.1.03 లక్షల కోట్లు
ముఖ్యమంత్రిగా మరో రూ.2.55 లక్షల కోట్ల అవినీతి
తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో విరుచుకుపడిన నిమ్మల రామానాయుడు
జగన్‌ దోపిడీపై ప్రజలను చైతన్యపరుస్తున్నారనే చంద్రబాబుపై కుట్రలు
ఈనాడు, అమరావతి

గన్‌రెడ్డి అధికారం చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత దోపిడీ పర్వాన్ని కొనసాగించారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఆ వివరాల్ని మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. జగన్‌రెడ్డి 2004-09 మధ్య రూ.1.03 లక్షల కోట్లు.. 2019-23 మధ్య రూ.2.55 లక్షల కోట్లు కలిపి మొత్తంగా రూ.3.58 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు లెక్క తేల్చారు.

నిమ్మల రామానాయుడు ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

2004లో రూ.1.65 కోట్లు ఉన్న జగన్‌ ఆస్తి 2023 నాటికి రూ.3.58 లక్షల కోట్లకు ఎలా ఎగబాకింది?

‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనే టెలికామ్‌ కంపెనీ ట్యాగ్‌లైన్‌ జగన్‌రెడ్డికి బాగా సరిపోయింది. 2000వ సంవత్సరంలో రాజశేఖరరెడ్డి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-2లో వారికున్న 2,075 గజాల ఇల్లు అమ్ముకోడానికి అనుమతివ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి రూ.1.65 కోట్లని స్వయంగా జగనే పేర్కొన్నారు. అప్పట్లోనే వైఎస్‌ తన ఆస్తులు రూ.1.74 కోట్లని ఆదాయ పన్ను శాఖకు తెలియజేశారు. అనధికార లెక్కల ప్రకారం 2004-09 మధ్య వైఎస్‌ కుటుంబం రూ.1.03 లక్షల కోట్లు ఆర్జించినట్లు తేలింది. ఇందులో రూ.43 వేల కోట్లు సీబీఐ ఛార్జిషీట్ల ద్వారా ఈడీ ఎటాచ్‌ చేసింది. ఇంకా రూ.60 వేల కోట్లకు సంబంధించిన వివరాలు తేలాల్సి ఉంది. తండ్రి అధికారంతో 2004-09 మధ్య రూ.1.03 లక్షల కోట్లు లూటీ చేసిన జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2019-23 మధ్య కేవలం నాలుగేళ్లలో రూ.2,55,000 కోట్లు అక్రమంగా సంపాదించారు. మొత్తంగా ఇప్పటి వరకు రూ.3,58,000 కోట్ల ప్రజాధనాన్ని దిగమింగారు. 2004లో రూ.1.65 కోట్లు ఉన్న జగన్‌ ఆస్తి 2023 నాటికి రూ.3.58 లక్షల కోట్లకు ఎలా ఎగబాకిందో ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.


ఐపీసీలో ఉన్న సెక్షన్లన్నీ జగన్‌పైనే..

‘న్యాయస్థానాల కళ్లుగప్పి పదేళ్లుగా బెయిల్‌పై ఉంటూ జగన్‌రెడ్డి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. తనపై 38 కేసులున్నాయని జగన్‌రెడ్డే 2019 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిపై 54 డిశ్ఛార్జ్‌ పిటిషన్లు వేశారు. సదరు కేసుల్లో ఇప్పటి వరకు న్యాయస్థానాల నుంచి ఆయన తెచ్చుకున్న స్టేలు 158. ఇక జగన్‌రెడ్డిపై నమోదైన ఐపీసీ సెక్షన్ల జాబితా కొండవీటి చాంతాడునే మించిపోతుంది. దాదాపుగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని అన్ని సెక్షన్లు ఆయనపై నమోదై ఉన్నాయి’ అని పేర్కొన్నారు.


జగన్‌రెడ్డి క్విడ్‌ ప్రో కో నుంచి పుట్టిందే సాక్షి..

‘తొలుత సాక్షి పత్రికలో పెట్టిన పెట్టుబడి రూ.8 లక్షలు. వాస్తవానికి ఆ పత్రిక మొత్తం ఆస్తి విలువ రూ.4 వేల కోట్లు. రూ.10 విలువ చేసే ఆ పత్రిక షేర్లను రూ.360కి అమ్మడమే ఆస్తులు అంతలా పెరగడం వెనుక ఉన్న రహస్యం. సెజ్‌లు, గనులు, భూములు, కాంట్రాక్టులు తమకు నచ్చినవారికి కట్టబెడితే.. అవి పొందినవారు ప్రతిఫలంగా జగతి పబ్లికేషన్స్‌ (సాక్షి దినపత్రిక)లో రూ.1,246 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి సాక్షి దినపత్రికలోకి అక్రమంగా నిధులు మారిషస్‌ నుంచి వచ్చాయని సీబీఐ అప్పట్లోనే తేల్చిన విషయం నిజం కాదా? తనకు పత్రిక లేదని, టీవీలు అసలే లేవని చెప్పే జగన్‌రెడ్డి ‘సాక్షి’ పుట్టుకపై ఏం సమాధానం చెబుతారు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తి సాక్షి పత్రిక కాదా?’ అని ప్రశ్నించారు.


ఒక సిమెంట్‌ కంపెనీ మరో సిమెంట్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం భారతి సిమెంట్స్‌లోనే జరిగింది

‘2006 మేలో భారతి సిమెంట్స్‌ సంస్థ ఛైర్మన్‌, ఎండీగా జగన్‌రెడ్డి ఉన్నారు. రూపాయి కూడా దానిలో పెట్టుబడి లేకుండానే ఆయన ఆ సంస్థ యజమానిగా కొనసాగారు. దాల్మియా, ఇండియా, పెన్నా సిమెంట్స్‌ సంస్థలు భారతి సిమెంట్స్‌లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఒక సిమెంట్‌ కంపెనీ మరో సిమెంట్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం భారతి సిమెంట్స్‌లోనే జరిగింది. ఒక్కోటి రూ.10 విలువ చేసే భారతి సిమెంట్స్‌ షేర్లను తన అధికారబలంతో జగన్‌రెడ్డి రూ.1,440కు విక్రయించడం గమనార్హం’ అని పేర్కొన్నారు.


ఓబుళాపురం ఖనిజ దోపిడీ జగన్‌రెడ్డి అవినీతికి పరాకాష్ఠ

బుళాపురం గనుల తవ్వకాల్లో గాలి జనార్దన్‌రెడ్డి పాత్రధారి అయితే.. తెర వెనుక సూత్రధారి జగన్‌రెడ్డి. ఇద్దరూ కలిసి లక్షల కోట్ల ఖనిజ సంపదను కొల్లగొట్టారు. ఇది జగన్‌రెడ్డి అవినీతికి పరాకాష్ఠ. 2006-09 మధ్య రూ.5,194 కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని దోపిడీ చేశారు. దీన్ని కూడా సీబీఐ బట్టబయలు చేసింది.


అవినీతికి మూలం సండూర్‌ పవర్‌

‘సండూర్‌ పవర్‌ సంస్థలో జగన్‌రెడ్డి 2001 జూన్‌ 16న డైరెక్టర్‌గా చేరారు. 2004లో వైఎస్‌ సీఎం అయ్యాక దీని దశే తిరిగింది. 2006లో నిమ్మగడ్డ కంపెనీల నుంచి సండూర్‌ పవర్‌కు రూ.140 కోట్లు మళ్లాయి. 2ఐ క్యాపిటల్‌, ఫ్యూరి ఎమర్జింగ్‌ సంస్థల నుంచి రూ.124 కోట్లు వచ్చాయి. 2007లో జెడ్‌ఎం ఇన్‌ఫ్రా, నెల్‌కోస్ట్‌, సిగ్మా కంపెనీల నుంచి రూ.553 కోట్ల పెట్టుబడి వచ్చి చేరింది. ఆ తర్వాత ఈ మూడు కంపెనీలు జగన్‌కు చెందిన కీలాన్‌ కంపెనీలో విలీనమయ్యాయి. తన కార్యం నెరవేరాక.. తాను సృష్టించిన షెల్‌ కంపెనీలను తన కంపెనీలోనే విలీనం చేసుకున్నారు. ఇది జగన్‌ అతి తెలివితేటలకు నిదర్శనం. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు భూకేటాయింపులపై 2008లో వైఎస్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 8,844 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీనికి కృతజ్ఞతగా ఇందూ సంస్థ జగతి పబ్లికేషన్స్‌లో రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టింది. కేటాయించిన 8,844 ఎకరాల్లో 4,397 ఎకరాలను సదరు సంస్థ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.790 కోట్లు రుణం తీసుకుంది. ఈ రుణాన్ని కూడా స్వప్రయోజనానికి వినియోగించుకున్నారే తప్ప నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటుకు ఉపయోగించలేదు. ఇందులో రూ.562 కోట్లు దుర్వినియోగం చేశారు’ అని మండిపడ్డారు.


సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ విషయంలో అప్పట్లోనే కోర్టును తప్పుదారి పట్టించారు

‘సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌లో జగన్‌రెడ్డి, భారతీరెడ్డి, విజయమ్మ డైరెక్టర్లు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.3,257 కోట్లలో జగన్‌రెడ్డి కుటుంబం పెట్టుబడి కేవలం రూ.24 కోట్లు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాచేపల్లి మండలంలోని రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారు. దీంతో పాటు కాజేసిన 1500 ఎకరాల ప్రభుత్వ భూమి వారి స్వాధీనంలోనే ఉన్నా.. లేదని అప్పట్లోనే కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారు. అధికారంలో ఉండి ఇప్పుడు ఆయన ప్రజలకు నిజాలు చెబుతారా? రూ.కోటి పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ పేరుతో కారు కొనడానికి 2002లో బ్యాంకు నుంచి రూ.5 లక్షలు రుణం తీసుకున్నారు. అలాంటి సంస్థ ఎవరి భాగస్వామ్యం లేకుండానే 2010 నాటికి రూ.3,257 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ పెడతామనే స్థాయికి వస్తుందా?’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని