KTR: మోదీ.. తెలంగాణపై ఎందుకింత వ్యతిరేకత?

ప్రధానమంత్రి డీఎన్‌ఏలోనే తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Updated : 27 Sep 2023 08:49 IST

తల్లిని చంపి బిడ్డను వేరు చేశారనడం అజ్ఞానమే
రాబోయే ఎన్నికల్లో భాజపా అడ్రస్‌ గల్లంతే
మండిపడిన కేటీఆర్‌
ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనపై గవర్నర్‌ నిర్ణయం
అప్రజాస్వామికమని విమర్శ

పదేళ్లుగా తెలంగాణ మీద, రాష్ట్రం ఏర్పాటు మీద మీరు(మోదీ) సందర్భం దొరికినా.. దొరకకపోయినా ఎందుకు విషం చిమ్ముతున్నారు? తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ.. ప్రజల ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? తెలంగాణపై మీకు ఎందుకింత వ్యతిరేకత? ఇక్కడి త్యాగాల పట్ల ఎందుకు చిన్నచూపు? తల్లిని చంపి, బిడ్డను వేరు చేశారని మీరు మాట్లాడడం అజ్ఞానం కాదా?

కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి డీఎన్‌ఏలోనే తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. అందుకే పగబట్టినట్టు.. తెలంగాణ పుట్టుకను, అస్థిత్వాన్ని, ఉద్యమాన్ని పదే పదే అగౌరవపరుస్తున్నారని ధ్వజమెత్తారు. భాజపాలో ఆయన మొదలు గల్లీ స్థాయి నాయకుడి దాకా ఇదే ధోరణిలో తెలంగాణపై విషం చిమ్ముతున్నారని అన్నారు. అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీని భారాస, తెలంగాణ ప్రజల తరఫున కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నామన్నారు. ‘మోదీ పాలమూరు గడ్డపై కాలు పెట్టేటప్పుడు.. కృష్ణా జలాల వాటాపై స్పష్టత ఇవ్వాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. తెలంగాణ జాతికి ద్రోహం, దగా చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, సైదిరెడ్డి, మాగంటి గోపీనాథ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, భారాస నాయకులు దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ తదితరులతో కలిసి మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ ప్రజల శాపం మీకు తప్పకుండా తగులుతుంది

‘‘విభజన హామీలను మోదీ పాతరేశారు. అందుకు ప్రతిఫలం ఉంటుంది. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే రాష్ట్రంలో మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందో.. మీ దిక్కుమాలిన వ్యవహారం వల్ల రాబోయే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లోనూ అడ్రస్‌ లేకుండా పోతుంది. తెలంగాణ ప్రజలశాపం మీకు తప్పకుండా తగులుతుంది’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇంతటి దుర్మార్గమైన ప్రధానమంత్రి ఈ దేశంలో ఇప్పటిదాకా లేరని, బహుశా భవిష్యత్తులో కూడా రారని ఆయన అన్నారు.

మోదీ ఏజెంటుగా గవర్నర్‌

‘‘రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. పైన ప్రధానమంత్రి మోదీ.. ఇక్కడ మోదీ ఏజెంటు గవర్నర్‌ కూడా అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న వారిని ఇలాంటి పదవుల్లోకి తీసుకురావద్దని గవర్నర్‌ లేఖ రాశారు. ఇంతకంటే హాస్యాస్పదం మరోటి లేదు. ఆమె గవర్నర్‌ అవడానికి ఒకరోజు ముందు వరకు కూడా.. తమిళనాడు భాజపా అధ్యక్షురాలిగా పనిచేశారు. మరి ఆమె ఎలా అర్హురాలు అవుతారు? గవర్నర్‌ అయ్యాక కూడా ఆమె ఇప్పటికీ భాజపా నాయకురాలిగా పనిచేయడం లేదా?

అవసరమైన డాక్యుమెంట్లు మళ్లీ పంపిస్తాం

దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవాళ్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్లు నామినేట్‌ చేసిన సంఘటనలు అనేకమున్నాయి. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ప్రజా ఉద్యమంలో పాల్గొన్న వారు అనర్హులని చెబుతారు. గవర్నర్‌ కోరిన విధంగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు జతపర్చి మళ్లీ పంపిస్తాం. ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

అన్‌ఫిట్‌ నాయకుడు కిషన్‌రెడ్డి

దేశం మొత్తమ్మీద అన్‌ఫిట్‌ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది కిషన్‌రెడ్డి అని కేటీఆర్‌ విమర్శించారు. ఆయన సొంత నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేని అసమర్థుడని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని