చంద్రబాబు కోసం దివ్యాంగుల దీక్ష

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో మంగళవారం ఆందోళనలు కొనసాగాయి.

Published : 27 Sep 2023 05:46 IST

హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, బృందం: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో మంగళవారం ఆందోళనలు కొనసాగాయి. నిరసన దీక్షలతో తెదేపా కార్యకర్తలు, అభిమానులు బాబు అక్రమ అరెస్టును ఖండించారు. హైదరాబాద్‌ దోమలగూడలోని తెదేపా నగర కార్యాలయం ఎదుట దివ్యాంగులు నిరసన దీక్ష చేపట్టారు. తొలుత ‘నేను సైతం’ అంటూ బాబుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. తెదేపా సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా విద్య, ఉపాధి రంగాల్లో ప్రాధాన్యమిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని బోరబండ తెదేపా అధ్యక్షుడు జి.అరుణ్‌రాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు గణేశునికి పూజలు చేశారు. షాద్‌నగర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మౌన దీక్ష చేపట్టారు. తెతెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీజీకే మూర్తి ఆధ్వర్యంలో పలువురు నేతలు రాజమహేంద్రవరంలో ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు.


తెలంగాణ.. మీ సొంత రాజ్యమా?

-కాసాని

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసన ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దని, ఆంధ్రాలోనే చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించడం గర్హనీయమని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ఇక్కడ నిరసన చేయొద్దని కేటీఆర్‌ ఫత్వా జారీ చేయడానికి తెలంగాణ ఏమైనా ప్రత్యేక దేశమా? లేకపోతే కేటీఆర్‌ రాజ్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యం కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాను అరెస్టు చేస్తే ఖండించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌.. వారి కుటుంబానికి రాజకీయ ఉన్నతిని కల్పించిన చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించకముందే మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల్లో భారాస ఎందుకు సభలు నిర్వహిస్తోందో సమాధానం చెప్పాలన్నారు. జగన్‌ ప్రభుత్వ దుశ్చర్యను ఖండిస్తూ.. చంద్రబాబుకు మద్దతుగా తెదేపాశ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా.. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేటీఆర్‌కు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని.. క్షమాపణ చెప్పాలని కాసాని డిమాండ్‌ చేశారు.


ఏపీలో భారాస రాజకీయాలు చేయడం లేదా?

-నన్నూరి నర్సిరెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతుంటే కేటీఆర్‌ భరించలేకపోతున్నారని తెదేపా జాతీయ అధికారి ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా చోరీ జరిగిందన్న ఆరోపణలపై మీకేం సంబంధం ఉందని హైదరాబాద్‌లో గతంలో కేసులు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. తెరాసను భారాసగా మార్చి ఏపీలో రాష్ట్ర కమిటీని ఏర్పాటుచేసి రాజకీయాలు చేయడం లేదా? అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని