వేధింపుల కోసం అరెస్టు చేయడం తప్పు

చంద్రబాబును వేధింపులకు గురి చేసేందుకు అరెస్టు చేయడం తప్పని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు.

Published : 27 Sep 2023 06:56 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

ఈనాడు, అమరావతి: చంద్రబాబును వేధింపులకు గురి చేసేందుకు అరెస్టు చేయడం తప్పని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. సీఎంగా పని చేసిన వ్యక్తిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విజయవాడలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు అరెస్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ తెదేపా.. భాజపా పంచన చేరి లబ్ధి పొందాలనుకుంటే దాని వల్ల ఉపయోగం లేదని అర్థం చేసుకోవాలి. దేశం కోసం ఒకసారి పునరాలోచన చేయాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. భాజపాకు వ్యతిరేకంగా నిలబడాలి. దానితో సన్నిహితంగా ఉండే పార్టీలను నాశనం చేసి, అది ఎదిగింది. మోదీకి మద్దతు ఇవ్వడంలోనే వైకాపా తలమునకలైపోయింది. జమిలి ఎన్నికలు దేశానికి ప్రమాదకరం. భాజపాకు మహిళా రిజర్వేషన్‌పై చిత్తశుద్ధి లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని ఆరాట పడుతోంది’’ అని విమర్శించారు. ఎంఏ బేబి మాట్లాడుతూ...మహిళ రిజర్వేషన్‌ తీసుకొచ్చిన ప్రధాని మోదీ, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తలపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని