బాబు అరెస్ట్‌.. జగన్‌ శాడిజానికి నిదర్శనం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం.. సీఎం జగన్‌ శాడిజానికి నిదర్శనమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు.

Published : 27 Sep 2023 05:34 IST

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు 

 

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం.. సీఎం జగన్‌ శాడిజానికి నిదర్శనమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రాజకీయ కక్షతోనే అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. జగన్‌ పతనం తప్పదని హెచ్చరించారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఈ కేసులో సీమెన్స్‌ మాజీ ఎండీతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో పెట్టి, చంద్రబాబుపై ఆరోపణలు చేయాలని వారిని హింసించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పీకల్లోతు అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్‌.. తనలా చంద్రబాబు చేసిన ప్రతి పనిలోనూ అవినీతి ఉందని భావించడం మూర్ఖత్వమన్నారు. ఏపీఎస్‌డీసీ కార్పొరేషన్‌లో కార్యదర్శిగా పని చేసిన ప్రేమచంద్రారెడ్డి పేరులో చివరి రెండక్షరాలను చూసే ఆయనపై కేసు పెట్టలేదని ఆరోపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా 2.40 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 72 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం వాటా సమకూర్చిన ఈ ప్రాజెక్టులో రూ.279 కోట్లు అవినీతి జరిగిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన 18 నెలలకు ఏ విధంగా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.

మంత్రి బొత్సకు మతిభ్రమించింది: రిమాండ్‌ నివేదికలో చేసిన ఆరోపణలు చూస్తుంటే.. ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని వడ్డే అన్నారు. సీఐడీ అధికారి సంజయ్‌ విజయవాడలోని సిద్ధార్థ కళాశాల, ఇడుపులపాయలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను చూడాలని హితవు పలికారు. మంత్రి బొత్సకు పిచ్చిపట్టడం వల్లే.. అసలు సీమెన్స్‌తో ఒప్పందమే లేదు, శిక్షణే లేదని చెబుతున్నారని, ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్దోషిగా బయటికి వస్తారని అన్నారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ,  తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నరేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని