వైకాపా పాలనలో దళితులపై దమనకాండ

‘వైకాపా పాలనలో దళితులపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.

Published : 28 Sep 2023 05:18 IST

ప్రజాస్వామ్య పరిరక్షణకు వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలి
విశాఖలో మాల మహానాడు, దళిత సంఘాల పిలుపు

ఈనాడు, విశాఖపట్నం: ‘వైకాపా పాలనలో దళితులపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. జగన్‌ను ఎస్సీలు, దళిత క్రైస్తవులు భుజాన వేసుకొని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే వారిని అణగదొక్కారు. హత్యలు చేసి మృతదేహాలను పార్సిల్‌ చేస్తున్నారు. ఆస్తులు లాగేసుకుంటున్నారు. వీటన్నింటినీ ఖండించాల్సిన సీఎం నోరు మెదపడం లేదు. వీటిపై ప్రశ్నించేందుకు ప్రతి దళితబిడ్డ ఏకమవ్వాలి’ అని విశాఖలో మాల మహానాడు, దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం విశాఖ పౌరగ్రంథాలయంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల దళిత నాయకుల సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా కలిసి తెదేపాను గెలిపించాలన్నారు. ‘ఎస్సీల రక్షణకు తీసుకొచ్చిన ఎట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ వైకాపా ప్రభుత్వం ఎస్సీల మీదే కేసులు బనాయించింది. మాస్కు అడిగిన నేరానికి వైద్యుడు సుధాకర్‌ను హింసించి చంపేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన కారుడ్రైవరయిన దళిత యువకుడ్ని హత్య చేస్తే... సీఎం సమావేశాలకు పిలిపించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే మాలలు వైకాపాను ఓడించి ఈ సీఎంకు బుద్ధి చెప్పాలని కోరారు.

డీపట్టాలు లాక్కుంటున్న వైకాపా నేతలు: గత ప్రభుత్వాలు ఇచ్చిన డీపట్టా, ఎసైన్డ్‌ భూములను వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు దళితుల నుంచి లాగేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల నాటికి అవి ఎస్సీల వద్ద లేకుండా చేయాలనే డీపట్టాల క్రమబద్ధీకరణ చట్టాన్ని తీసుకొచ్చారని, అదేమని అడిగితే అరెస్టులు చేస్తున్నారని ఏయూ విశ్రాంత ఆచార్యులు జాన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో దళితులను అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకే ఉందన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పెంటారావు మాట్లాడుతూ దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ తమపై జరుగుతున్న దాడులపై ఒక్క మాటైనా మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. ఎస్సీల రక్షణకు తెచ్చిన ఎట్రాసిటీ కేసుల్లో వెంటనే బెయిల్‌ ఇచ్చేయడం, గతంలో ఇచ్చిన భూములను లాక్కుని ఇళ్ల స్థలాలకు కేటాయించడం, ఎస్సీ పథకాలను రద్దు చేయడం, రుణాలు ఇవ్వకపోవడం వంటివి ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. ఇవన్నీ ఆలోచించి వచ్చే ఎన్నికల్లో దళితులు ఒక నిర్ణయానికి రావాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని