Ayyannapatrudu: వైకాపా ప్రభుత్వ అక్రమాలు కనిపించడం లేదా ఉండవల్లీ?: అయ్యన్న

‘వైకాపా పాలనలో అక్రమాలు కళ్లెదుట కనిపిస్తున్నా మేధావిగా గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఎందుకు ప్రశ్నించడం లేదో?

Updated : 28 Sep 2023 07:18 IST

‘తప్పుదోవలో వెళ్తున్నారు.. సరిదిద్దుకోవాలి’ అని జగన్‌కు సూచించలేదా?
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, టి.నగర్‌: ‘వైకాపా పాలనలో అక్రమాలు కళ్లెదుట కనిపిస్తున్నా మేధావిగా గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఎందుకు ప్రశ్నించడం లేదో? చంద్రబాబు పాలనలో బ్రాందీ సీసాలు చూపించి ఎన్నో కథలు చెప్పిన ఆయన.. ఈరోజు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మౌనం దాల్చడం వెనక ఆంతర్యమేమిటి? తిరుపతిలో దోపిడీ విపరీతంగా జరుగుతున్నా.. దేవాదాయ శాఖ భూములు 43 వేల ఎకరాలు కనిపించడం లేదని ఆ శాఖ మంత్రి చెప్పినా.. ఎందుకు మాట్లాడడం లేదో? స్కిల్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తే సీబీఐ విచారణ చేయాలని కోరుతున్నారంటే మీ మేధావితనం ఏమైంది? ఆ కేసులో ఏముంది? మీ దగ్గర ఒక్క ఆధారమైనా ఉందా? సీఎం జగన్‌ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ జనంలోకి చంద్రబాబు వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టిస్తుంటే సమర్థిస్తున్నారా?’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు కుటుంబసభ్యులు బస చేసిన శిబిరం వద్ద బుధవారం విలేకరులతో అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ‘మీ సొంత జిల్లా తూర్పుగోదావరిలో టన్నుల కొద్దీ ఇసుక మాయమైపోతున్నా.. ఒక్క రిపోర్టు అయినా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? అందులో మీకు వాటాలు ఉన్నాయా?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘రాజానగరంలో ఆవ భూముల కుంభకోణం జరగలేదా? కత్తిపూడిలో అటవీ శాఖ భూముల్లో ఖనిజ సంపద దోపిడీ యథేచ్ఛగా సాగుతూ... లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ను భారతీ సిమెంట్‌కు పోలీసుల సహకారంతో యథేచ్ఛగా తరలిస్తున్నా మౌనం వహిస్తున్న మేధావి.. మిగతావారి మీద బురద చల్లడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

రామోజీరావుతో ఫైట్‌ చేస్తున్నారు.. అగ్రిగోల్డ్‌ బాధితుల గురించి పట్టదా?

‘రామోజీరావుతో ఎప్పటి నుంచో ఫైట్‌ చేస్తున్నారు. న్యాయం కోసం చేయండి. మేం వద్దని చెప్పం. ఆయనపై ఒక్కరైనా ఫిర్యాదు చేశారా? మరి దాన్నెందుకు రాద్ధాంతం చేస్తున్నారు? రామోజీ రాష్ట్రానికి ఏమైనా నష్టం చేశారా? అగ్రిగోల్డ్‌లో వేల మంది బాధితులున్నారే.. వారి గురించి ఎందుకు మాట్లాడం లేదు? సీఎం చెప్పిన పలుకులే మీ నోటి నుంచి వస్తాయా?’ అని అయ్యన్న విమర్శించారు. ‘రాష్ట్రంలో రాజధాని లేకున్నా.. గంజాయి వ్యాపారంలో ఏపీ నంబరువన్‌గా కొనసాగుతూ యువత నాశనమైపోతున్నా మీకు పట్టదా ఉండవల్లీ? అని ఉండవల్లిపై అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని