తెలంగాణకు భరోసా ఇవ్వని ప్రధాని

మోదీ దేశానికి ప్రధానమంత్రా? గుజరాత్‌కా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆయన ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు.

Published : 03 Oct 2023 03:35 IST

మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: మోదీ దేశానికి ప్రధానమంత్రా? గుజరాత్‌కా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆయన ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వకుండా.. పసుపు బోర్డును కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని రేవంత్‌ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రీల జయంతి సందర్భంగా వారికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నేతలు మధుయాస్కీ, చిన్నారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, రోహిన్‌రెడ్డిలతో కలసి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే తప్పుపట్టిన ఆయనతో సభ నిర్వహించినందుకు పాలమూరు జిల్లా ప్రజలకు డి.కె.అరుణ, జితేందర్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి. తెలంగాణను మోదీ అవమానించినందుకే భాజపా నేతలు వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, రాజ్‌గోపాల్‌రెడ్డి సభకు హాజరు కాలేదనే చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ కుటుంబం అవినీతిని బయటకు తీస్తామని మోదీ ఎందుకు చెప్పలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట ఓట్లు చీల్చి భారాసను గెలిపించాలని ఆయన చూస్తున్నారు.

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోల్లోని హామీల అమలుపై చర్చకు వస్తా. 2014, 2018 ఎన్నికల్లో తెరాస(ప్రస్తుత భారాస) ప్రకటించిన మ్యానిఫెస్టోల్లోని హామీల అమలుపై కేటీఆర్‌, హరీశ్‌రావు చర్చకు వస్తారా? రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? కాంగ్రెస్‌లో సీఎంలు మారతారని భారాస మంత్రులు విమర్శిస్తున్నారు. బహుళ నాయకత్వముంటే తప్పేంటి? కర్ణాటక ప్రభుత్వ వసూళ్లపై కేటీఆర్‌కి అనుమానం ఉంటే విచారణ చేయించాలని లేఖ రాయాలి. తెలంగాణ ప్రభుత్వ వసూళ్లపై విచారణ జరపాలని నేను కూడా లేఖ రాస్తే విచారణ జరిపిస్తారా?

సీఈసీ భేటీ తర్వాతే అభ్యర్థుల ప్రకటన

వచ్చే ఎన్నికల్లో భారాసకు 25 సీట్లకు మించి రావు. మహిళా ఓటర్లు కాంగ్రెస్‌ వైపే ఉన్నారు. రాష్ట్రంలో 19 శాతం ఓటర్లు తటస్థంగా ఉన్నారు. వీరిలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్‌కే వస్తాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయంతో ఉచిత సిలిండర్లు, సన్నబియ్యం రేషన్‌, రైతులకు పింఛన్లు లాంటి హామీలు ఇచ్చేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ తర్వాతే పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. చాలామంది భాజపా, భారాస నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. పొత్తులు, షర్మిల చేరిక అంశాలను అధిష్ఠానం చూసుకుంటుంది. సీట్ల కేటాయింపులో నేను, తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కుమ్మక్కయ్యామని ఎవరూ అపోహపడొద్దు. బీసీలకు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. ఎన్నికల షెడ్యూలు ప్రకటన తర్వాత ప్రచార ప్రణాళిక ఖరారు చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.


‘జీవో 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయండి’

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని జీవో 317 ఉద్యోగ, ఉపాధ్యాయ బాధితుల సంఘం ప్రతినిధులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కోరారు. సోమవారం వారు గాంధీభవన్‌లో రేవంత్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు.

కొడంగల్‌ నియోజకవర్గ భారాసకు చెందిన పలువురు సోమవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు