10న రాష్ట్రానికి అమిత్‌షా

భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అగ్రనేతల సభలతోపాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Published : 03 Oct 2023 03:35 IST

రెండో వారంలో భాజపా అభ్యర్థుల తొలి జాబితా

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అగ్రనేతల సభలతోపాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ సభతో శ్రీకారం చుట్టిన కార్యాచరణను అయిదు రోజులపాటు ఒక దశగా కొనసాగించాలని నిర్ణయించింది. మంగళవారం నిజామాబాద్‌ బహిరంగ సభకు ప్రధాని రానున్నారు. తరువాత ఈ నెల 10న   కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానున్నారు. ఆయన బహిరంగసభను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర నేతలు దృష్టిసారించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దిల్లీలో అమిత్‌షాతో సమావేశమై రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 6న భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా హైదరాబాద్‌కు రానున్నారు. నవంబరు మొదటి వారంలోపు రాష్ట్రంలో 30 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. వీటిల్లో జాతీయ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.  

5న సునీల్‌బన్సల్‌, తరుణ్‌ఛుగ్‌.. 6న నడ్డా రాక

ఈ నెల 2వ వారంలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేలా భాజపా దృష్టి సారించింది. 5, 6వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే విస్తృతస్థాయి సమావేశాల్లో దీనిపై చర్చించనున్నట్లు తెలిసింది. 5న రాష్ట్ర భాజపా ఇన్‌ఛార్జులు సునీల్‌బన్సల్‌, తరుణ్‌ఛుగ్‌తోపాటు జిల్లా అధ్యక్షులు, పదాధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. 6న జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌ఛార్జులతో పాటు ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని