కాంగ్రెస్‌లో కాక

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నవారిలో అసంతృప్తి పెరుగుతోంది. భారాస, భాజపాల నుంచి పలువురు నేతలు పార్టీలో చేరుతున్నారని, మరికొందరూ త్వరలో రానున్నారని ఒకవైపు పీసీసీ నేతలు చెబుతుండగా..

Updated : 03 Oct 2023 06:42 IST

ఇతర పార్టీల నుంచి చేరినవారికి టికెట్ల ఖరారుపై ప్రచారం
సీనియర్‌ నేతలు, ఆశావహుల్లో అసంతృప్తి
మైనంపల్లి చేరికతో మెదక్‌, మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుల రాజీనామాలు

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నవారిలో అసంతృప్తి పెరుగుతోంది. భారాస, భాజపాల నుంచి పలువురు నేతలు పార్టీలో చేరుతున్నారని, మరికొందరూ త్వరలో రానున్నారని ఒకవైపు పీసీసీ నేతలు చెబుతుండగా.. మరోవైపు పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతుండటం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆది, సోమవారాల్లో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ)ల అధ్యక్షులు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపింది.

ఫలించని బుజ్జగింపులు

రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ టికెట్ల కోసం 1,006 మంది దరఖాస్తు చేశారు. తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఖరారవుతున్నాయని జరుగుతున్న ప్రచారంతో కొన్ని జిల్లాల్లో పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్నవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి భారాస ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో మెదక్‌, మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేశారు. మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. మైనంపల్లి చేరికతో అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క, మల్లు రవి తదితర సీనియర్‌ నేతలు స్వయంగా నందికంటి నివాసానికి వెళ్లి పార్టీని వీడవద్దని.. ఎన్నికల్లో గెలిచాక మంచి అవకాశాలుంటాయని చెప్పారు.

అదేరోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా స్వయంగా దిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయని, పార్టీ కోసం పనిచేయాలని బుజ్జగించారు. అయినా శ్రీధర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు, మైనంపల్లి కుమారుడు రోహిత్‌రావుకు మెదక్‌ అసెంబ్లీ టికెట్‌ ఇస్తారంటూ ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారంతో.. మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు కె.తిరుపతిరెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన 2019 నుంచి మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. మైనంపల్లి చేరికతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌లో డబ్బు రాజకీయాలు సాగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిరెడ్డి, నందికంటి శ్రీధర్‌లు భారాసలో చేరనున్నారని తెలుస్తోంది.

ఆ రెండు జిల్లాల్లోనూ..

నారాయణపేట, మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షులు కూడా టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జిల్లాల్లో సైతం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు దక్కితే ఈ రెండు జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు తీసుకునే నిర్ణయంపై చర్చ సాగుతోంది. ‘‘ఇతర పార్టీల నుంచి ప్రముఖ నేతలను, బలమున్నవారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర పార్టీలు కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ వారిని ఆకర్షించి చేర్చుకోవడం సాధారణం. ఒకరిద్దరు నేతలు రాజీనామా చేసినంత మాత్రాన పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం ఉండదు. ఎన్నికల సమయంలో చేరికలు, రాజీనామాలు మామూలే’’ అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు పేర్కొన్నారు. 119 స్థానాల్లో గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందని, టికెట్‌ రాదనే అనుమానంతో అసంతృప్తికి గురవుతున్నవారిని అంతర్గతంగా బుజ్జగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్‌లో తిరిగి చేరిన యాదాద్రి డీసీసీ మాజీ అధ్యక్షుడు కె.అనిల్‌కుమార్‌కు భువనగిరి అసెంబ్లీ టికెట్‌ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


కార్యకర్తలపై కేసులు బనాయించిన వారికి టికెట్‌ హామీ ఇచ్చినందుకే రాజీనామా

-శ్రీధర్‌

అల్వాల్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులపాలు చేసిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడికి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశంపై హామీ ఇచ్చినందుకు మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన సోమవారం సాయంత్రం ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా పత్రం పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు