తప్పుడు కేసులతో కక్షసాధింపు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని, అందుకే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, కక్ష సాధింపునకు దిగారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Published : 03 Oct 2023 03:57 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజం
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ దిల్లీలో నిరశన దీక్ష

ఈనాడు, దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని, అందుకే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, కక్ష సాధింపునకు దిగారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని  నారా భువనేశ్వరి రాజమండ్రిలో చేపట్టిన నిరశన దీక్షకు సంఘీభావంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, రఘురామకృష్ణరాజు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్‌రావులతో కలిసి లోకేశ్‌ దీక్ష చేపట్టారు. కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో జరిగిన ఈ దీక్ష అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మహాత్మాగాంధీ, మండేలా లాంటి మహానుభావులు నమ్ముకున్న సిద్ధాంతం కోసం జైలుకు వెళ్లారని, ఇప్పుడు యువతకు ఉపాధి కల్పించడానికి యుద్ధప్రాతిపదికన పని చేసినందుకు జగన్‌మోహన్‌రెడ్డి నా తండ్రిని జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు మాకు చెప్పడమే కాదు చేసి చూపించేవారు.  అందులో భాగంగానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేú,‡ 2.15 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. అందులో 80 వేల మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలూ దక్కాయి. నాడు సైబరాబాద్‌, నేడు అమరావతితోపాటు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరులను పెద్దఎత్తున అభివృద్ధి చేసింది చంద్రబాబే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే చంద్రబాబుపై దొంగకేసులు పెట్టి జైలుకు పంపాలన్న లక్ష్యంతో పనిచేసింది. అందులో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపింది.  అయినప్పటికీ కార్యకర్తలు, ప్రజలు వెనక్కు తగ్గకుండా 24 రోజులుగా శాంతియుతంగా రోడ్లమీదికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులూ పెద్దఎత్తున పాల్గొని ‘మోత మోగిద్దాం’ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మీరందరూ ఒప్పుకుంటే చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతినాడు నిరాహారదీక్ష చేయాలనుకుంటున్నానని అమ్మ భువనేశ్వరి పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీని కోరారు. ఆమెకు సంఘీభావం తెలుపుతూ దిల్లీతోపాటు, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, పక్క రాష్ట్రాల్లో దీక్షలు చేపట్టిన తెలుగువారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం వద్ద ఆధారాలుంటే న్యాయమూర్తికి అందించేవారు. అవి లేవు కాబట్టి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు ఎక్కడ బెయిల్‌ వస్తుందోనన్న భయంతో మరో పీటీ వారంట్‌ సిద్ధంగా పెట్టుకొని మరో దొంగ కేసులో ఇబ్బంది పెట్టాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి మూడు కేసులు సిద్ధం చేశారు. లోకేశ్‌, బ్రాహ్మణి, భువనేశ్వరిని జైలుకు పంపుతామని మంత్రులు రోజుకోసారి ప్రకటనలు చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు. తెదేపా తరఫున మా పోరాటం కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దొంగ పనులన్నీ ఆధారాలతో ప్రజల ముందు పెడతాం. నాపై ఇప్పటికి మూడు కేసులు ఉన్నాయని తెలుసు. అవి నేను మంత్రిగా పనిచేసినప్పుడు నా శాఖకు ఎలాంటి సంబంధం లేని నిర్ణయాలు. దొంగకేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసినట్లు నా విషయంలోనూ చేస్తే న్యాయం, చట్టాలే కాపాడాలి. దేశంలో 99% రాజకీయ పార్టీలు, నాయకులు చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు. అసలు రోడ్డే లేని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నాకు నోటీసులిచ్చి సంబంధంలేని డాక్యుమెంట్లు అడుగుతున్నారు. నేను సీఐడీ విచారణకు హాజరవడానికి సిద్ధం. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌ను అరెస్టు చేసే ఉద్దేశం లేదని ఈ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. మేం ఓ పిచ్చివాడితో పోరాడుతున్నందున ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశాం. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. 

పెద్దఎత్తున పాల్గొన్న తెలుగువారు

లోకేశ్‌ దీక్షలో తెలుగుదేశం శ్రేణులు, దిల్లీలోని తెలుగువారు, ఇక్కడి యూనివర్శిటీల్లో చదువుతున్న, సివిల్స్‌ శిక్షణ తీసుకుంటున్న తెలుగు విద్యార్థులు, నోయిడా, గురుగ్రామ్‌ల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గ్గొని సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు యోగక్షేమాలు కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్‌తోపాటు, దీక్షలో పాల్గొన్న ఎంపీలకు చిన్నారులతో నిమ్మరసం ఇప్పించి దీక్ష విరమింపజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని