తెదేపా-జనసేన పొత్తుపై ప్రజల్లో నమ్మకం

‘తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ కూటమి గెలుస్తుందన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది. జగన్‌ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే కలసి పోరాడాల్సిన అవసరముంది.

Updated : 03 Oct 2023 07:06 IST

వైకాపా నేతలు నిరాశలో ఉన్నారు
కులాల పరిధి దాటితేనే అభివృద్ధి
రాజధాని ఏదో తెలియని రాష్ట్రంగా ఏపీ
పార్టీ సమావేశంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-మచిలీపట్నం: ‘తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ కూటమి గెలుస్తుందన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది. జగన్‌ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే కలసి పోరాడాల్సిన అవసరముంది. దీనిని ప్రజలు ముక్తకంఠంతో ఆమోదిస్తున్నారు. తెదేపా, జనసేన పొత్తు ప్రజలు నిర్ణయించింది. రాజకీయాల్లో ప్రజల కోసమే పనిచేయాలి. వ్యక్తిగత లెక్కలేమీ ఉండవు. జనసేన రోడ్లపై పోరాటం చేసే పార్టీగానే మిగిలిపోకూడదు. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారాహి నాలుగో విడత యాత్రలో భాగంగా పవన్‌ సోమవారం మచిలీపట్నంలో పర్యటించారు. ఓ కల్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజ్యాధికారమనే రక్తం మరిగిన వైకాపా నాయకుడిని ఇంటికి పంపించడమే మన ముందున్న లక్ష్యమని ఉద్బోధించారు. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైకాపా.. ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తోందని, దొంగ ఓట్లు చేరుస్తోందని ఆరోపించారు. ‘వైకాపా ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మనం కచ్చితంగా గెలుస్తున్నాం. గెలుపు నిష్పత్తిని బట్టి పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతాడా, లేదా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయిద్దాం’ అని పేర్కొన్నారు.

‘సీఎం జగన్‌ మూడు రాజధానులని హడావుడి చేశారు. సామాన్యుడు ఎక్కడికని తిరగగలడు? రాష్ట్రం విడిపోయి దశాబ్దం అవుతున్నా ఏది రాజధానో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయాం. జగన్‌ డ్రాకులా మాదిరిగా అధికారానికి అలవాటుపడ్డారు. నేను చాలా ఏళ్లుగా చూస్తున్నా. కడప జిల్లాలో ఓ పోలీస్‌ అధికారిని లాకప్‌లో వేసి దాడి చేశారు. జగన్‌ స్వభావం దుర్మార్గంగా ఉంటుందని అతని సన్నిహితులు చెబుతారు. తెలంగాణలో వారి ముఠా చేసిన దోపిడీ వల్లే అక్కడి యువత తిరుగుబాటు చేసింది. ఇలాంటి వ్యక్తి ఏపీకి హానికరమని మొదటి నుంచీ చెబుతున్నా. వైకాపా నేతలు మరో 6 నెలల్లో ఇంటికి వెళ్లబోతున్నారు’ అని అన్నారు. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో తీసుకువచ్చిన విధానాలను పవన్‌ తప్పుపట్టారు. బందరు పోర్టుకు మూడుసార్లు శంకుస్థాపన చేశారని, ఇదో ఎన్నికల గిమ్మిక్కు అని దుయ్యబట్టారు.

పరస్పరం గౌరవించుకుందాం: పొత్తు ధర్మం ప్రకారం జనసేన- తెదేపా నాయకులు, కార్యకర్తలు పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగాలని, మనలో మనం గొడవ పడితే మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని పవన్‌ హెచ్చరించారు. ‘మన మధ్య చిచ్చుపెట్టడానికి వైకాపా నేతలు కాచుకుని కూర్చున్నారు. వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు. నేను వేదికలపై జనసేన-తెలుగుదేశం అని సంబోధిస్తాను. తెదేపా నాయకులు కూడా తెలుగుదేశం-జనసేన అని చెబుతారు. ఇరు పార్టీల గౌరవానికి భంగం కలగకుండా పొత్తును ముందుకు తీసుకెళ్దాం. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెదేపాను జనసేన కార్యకర్తలు తక్కువ అంచనా వేయొద్దు. వారి పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో మిత్రధర్మం పాటిద్దాం. పోరాటాలకు వేదికైన జనసేనను సైతం తెదేపా శ్రేణులు సముచితంగా గౌరవించాలి. రాజధాని విషయమై నేను తెదేపాతో గతంలో విభేదించినప్పటికీ..అంధకారంలోకి జారిపోతున్న రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు సహకరించుకోవాల్సిన అవసరముంది. దీనివల్ల జనసేన ఎదుగుతుంది. తెలుగుదేశం స్థిరపడుతుంది. కలసి పని చేయాలనుకునే వారికి కూడా స్నేహహస్తం అందిస్తాం’ అని జనసేనాని వివరించారు.

కులాల మధ్య ఐక్యత అవసరం: ‘కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే అభివృద్ధి సాధ్యం కాదు. కులాల ఐక్యతపై పదేపదే చెబుతుంటా. ఏ ఒక్క కులం వల్లో అధికారం రాదని పార్టీలు గుర్తించాలి. నేను అన్ని కులాలనూ సమదృష్టితో చూసే వ్యక్తిని. ప్రత్యేకంగా కులాలు వెతుక్కుని స్నేహాలు చేయను. వైకాపా ప్రభుత్వంలో కీలక పదవులన్నీ ఒకే సామాజికవర్గంతో నింపేశారు. అధిక సంఖ్యలో ఉన్న కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఒక కులంపై మరొకరికి ద్వేషం అనవసరం. పార్టీ పెట్టగానే అధికారం రాదు. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. తొలిసారే అధికారంలోకి రావడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. జనసేన ప్రాంతీయ పార్టీ అయినా, మన భావజాలమే భవిష్యత్తులో దేశమంతా వ్యాపిస్తుంది. బలమైన నాయకులు జనసేన నుంచి తయారుకావాలి’ అని ఆకాంక్షించారు.

పాలకులది సంస్కారం లేని రాజకీయం: జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ‘పాలకులు కనీస సంస్కారం మరచి రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని అందరూ ఖండించాలి. అసెంబ్లీలో పవన్‌ ఉంటే రాష్ట్రానికి ఇంత దుస్థితి వచ్చేది కాదు. రెండేళ్ల క్రితమే ఆయన దూరదృష్టితో ‘వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌’ దిశగా అడుగులు వేశారు. అవనిగడ్డ సభకు వచ్చే వారిని మూడు కి.మీ. దూరంలో పోలీసులు ఆపేసినా విజయవంతమైంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డ్‌ చేసిన వారిని కూడా పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. తెదేపా కార్యక్రమాలకు మన పార్టీ నేతలు సహకరించాలి. జనసేన కార్యక్రమాలకు కూడా వారిని ఆహ్వానించాలి’ అని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు