YSRCP - VMRDA: వైకాపా నేతల ‘మాస్టర్‌’ ప్లాన్‌!

నగరాలలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)కు అధికార పార్టీ నేతలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో మాస్టర్‌ ప్లాన్‌లో ఇష్టానుసారంగా సవరణలు చేయిస్తున్నారు.

Updated : 03 Oct 2023 10:18 IST

వీఎంఆర్డీఏ ప్రణాళికలో ప్రతిపాదిత రహదారుల తొలగింపు
వారి వ్యాపార అవసరాలకు అనుగుణంగా మార్పులు
విశాఖలో ఏదైనా వారు చెప్పినట్లు చేయాల్సిందే

ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: నగరాలలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)కు అధికార పార్టీ నేతలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో మాస్టర్‌ ప్లాన్‌లో ఇష్టానుసారంగా సవరణలు చేయిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తుందని ప్రతిపాదిత రహదారులను సైతం రద్దు చేయించుకుంటున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజా ప్రయోజనాల కంటే నేతల సేవే పరమావధిగా వీరు వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆమోదించిన విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో ఎప్పటికప్పుడు చేస్తున్న సవరణలే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్‌ ప్లాన్‌లో సవరణలు చేయాలంటే అదో పెద్ద ప్రక్రియ. అయితే అధికార పార్టీ నేతలకు ఇది పెద్ద కష్టం కావడం లేదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించి అధికారుల సహకారంతో ఎప్పటికప్పుడు సవరణలు చేయించుకుంటున్నారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోకుండా సవరణలు చేసేస్తుంది.

  • విశాఖలోని ఎండాడలో మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదిత 80 అడుగుల రోడ్డుని 60 అడుగులకి కుదించారు. ఈ రోడ్డులో వైకాపా నేత ఒకరు భారీ హౌసింగ్‌ ప్రాజెక్టుని ప్రతిపాదించారు. 80 అడుగుల రోడ్డుతో ప్రాజెక్టులో కొంత స్థలాన్ని కోల్పోనున్నారు. ఆర్థికంగా నష్టమని భావించిన ఆయన ప్రతిపాదిత రోడ్డుని 60 అడుగులకు కుదించేలా ప్రభుత్వంలో చక్రం తిప్పారు. భవిష్యత్తులో ఈ రహదారిలో వాహనాల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున మాస్టర్‌ ప్లాన్‌ను సవరించవద్దని ప్రజలు కోరినప్పటికీ ప్రభుత్వం సవరణలు చేసేసింది.
  • అధికార పార్టీ నేతకు చెందిన ఒక లేఅవుట్‌కు అడ్డొస్తోందని భీమునిపట్నం మండలం దాకమర్రిలో వీఎంఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదిత 60 అడుగుల రోడ్డుని రద్దు చేశారు. రోడ్డు కారణంగా తన లేఅవుట్‌లోని ప్లాట్లకు నష్టం ఏర్పడుతుందన్న వేంకటేశ్వర డెవలపర్స్‌ మేనేజింగ్‌ భాగస్వామి, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి కేకే రాజు విజ్ఞప్తిపై ప్రభుత్వ స్థాయిలో ఆగమేఘాలపై దస్త్రాలు కదిలాయి. రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి కూడా ఒకరు ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించి మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదిత రోడ్డు రద్దు చేయించారు.
  • విశాఖలోని ఎండాడ రెవెన్యూ విలేజ్‌లో బీచ్‌ రోడ్డు నుంచి వై-జంక్షన్‌ను కలిపే 80 అడుగుల రోడ్డును మాస్టర్‌ ప్లాన్‌ నుంచి తొలగించాలన్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒకరి విజ్ఞప్తిపై ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సర్వే నంబరు 98, 100, 101, 102, 103లో వెళ్లేలా మాస్టర్‌ ప్లాన్‌లో రోడ్డును ప్రతిపాదించారు. అందులో తనకు చెందిన విలువైన స్థలం పోతుందని గమనించిన ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి చక్రం తిప్పారు. దీనికి అధికారులు సహకరించడంతో మాస్టర్‌ ప్లాన్‌ నుంచి రోడ్డుని ఇటీవలే తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని