వైకాపాకు ఒక్క సీటూ రాదు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని, వైకాపాకు ఒక్క సీటు కూడా రాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పులివెందులలో జగన్‌ కూడా గెలవరని జోస్యం చెప్పారు.

Published : 03 Oct 2023 03:57 IST

పులివెందులలో జగన్‌ కూడా గెలవరు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అమరావతి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని, వైకాపాకు ఒక్క సీటు కూడా రాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పులివెందులలో జగన్‌ కూడా గెలవరని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు, అభివృద్ధి, అవినీతి లేని పాలన, ప్రజల బాగు కోసం.. సైకో ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దించి తెదేపా, జనసేన కూటమిని గెలిపించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో మంగళగిరిలో సోమవారం ‘సత్యమేవ జయతే’ దీక్ష చేపట్టారు. శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మహిళలు, న్యాయవాదులతో కలిసి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. దీక్షకు సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు చిల్లపల్లి నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్‌ అని ధ్వజమెత్తారు. జగన్‌ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రూ.లక్షల కోట్లు సంపాదించినందునే కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలు 11 కేసులు నమోదు చేశాయన్నారు. ఒక అవినీతిపరుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే ఒక పౌరుడిగా బాధగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు ఏమీ చేయలేని జగన్‌ ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక 70 దేశాల్లో చంద్రబాబుకు పెద్దఎత్తున సంఘీభావం తెలుపుతున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, తాను ఒక్క అవినీతి చేసినట్లు నిరూపిస్తే నడిరోడ్డు మీద ఉరివేసుకుంటామని సవాల్‌ విసిరారు. ఇన్నర్‌ రింగు రోడ్డే లేనప్పుడు దానిలో అవినీతి జరిగిందని లోకేశ్‌పై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉన్నారన్నారు తన కేసుల్లో బెయిల్‌ కోసం అధికారంలోకి వచ్చిన తరువాత తమ ఎంపీలంతా కాంగ్రెస్‌కే మద్దతిస్తామని సోనియాగాంధీకి నమ్మబలికి జగన్‌ రాష్ట్ర విభజనకు సహకరించాడని ఆరోపించారు. పట్టాభి మాట్లాడుతూ ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా 24 వేల కిలోమీటర్లు కేబుల్‌ వైర్లు వేసి గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైర్లు కత్తిరించి అవినీతి జరిగిందని కేసులు పెడుతున్న అసమర్థ ముఖ్యమంత్రి జగన్‌ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని