గ్రామ స్వరాజ్యాన్ని జగన్‌ చంపేశారు

‘గ్రామ స్వరాజ్యాన్ని సాధించినప్పుడే మహాత్ముడికి నివాళి అర్పించినట్లు. దీనిని వైకాపా ప్రభుత్వం చేయలేకపోయింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి సీఎం జగన్‌ తూట్లు పొడిచి చంపేశారు.

Published : 03 Oct 2023 03:57 IST

జనసేనాని పవన్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘గ్రామ స్వరాజ్యాన్ని సాధించినప్పుడే మహాత్ముడికి నివాళి అర్పించినట్లు. దీనిని వైకాపా ప్రభుత్వం చేయలేకపోయింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి సీఎం జగన్‌ తూట్లు పొడిచి చంపేశారు. పంచాయతీల అధికారాలన్నీ తీసేశారు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ‘మన సమకాలీన నాయకులకు బ్రిటిష్‌ వారికి ఉన్నంత సంయమనం కూడా లేదు. కులం పేరుతో తెల్లవారి కంటే ఎక్కువగా సమాజాన్ని విభజిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల గాంధీ సిద్ధాంతాలను పూర్తిస్థాయిలో తీసుకెళ్లలేం. శాసనోల్లంఘన ద్వారానే ప్రజలు ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయొచ్చ’ని పవన్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మచిలీపట్నంలో గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంత్యుత్సవాల్లో పాల్గొని.. మహనీయులకు నివాళులు అర్పించారు. పవన్‌ 30 నిమిషాలు మౌనదీక్షలో ఉన్నారు. వేదికపై పుస్తక పఠనం అనంతరం మాట్లాడారు.

జగన్‌ దోచేసి.. దాచేశారు

‘స్వాతంత్య్ర సమరయోధులు తమ త్యాగంతో దేశానికి గుర్తింపు తెచ్చారు. నేడు కొందరు నాయకులు అవినీతి, దౌర్జన్యం, రౌడీయిజంతో సంపాదించిన వేల బిలియన్‌ డాలర్ల సొమ్మును విదేశీ బ్యాంకుల్లో దాచారు. ఇక్కడి కష్టాన్ని, శ్రమను విదేశాల్లో దాచుకోవడం.. అడ్డగోలుతనం. సీఎం జగన్‌ కూడా చాలా సొమ్మును విదేశాలకు తరలించారు. ఆ సొమ్మంతా తిరిగి దేశానికి వస్తుందో లేదో తెలియదు కానీ, ఇకపై ఈ దోపిడీ ఆగాలంటే మనం పూనుకోవాల్సిందే. సమాజంలో అన్ని పనులూ ఒక్కరమే చేయలేం. సమష్టిగా నిలిస్తేనే మార్పు తేగలమని మనం గాంధీ నుంచి నేర్చుకోవాలి. జైజవాన్‌.. జైకిసాన్‌ అని నినదించిన లాల్‌బహదూర్‌ శాస్త్రి అందరికీ ఆదర్శప్రాయుడు. జగన్‌ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఎవరన్నా బాధ్యత తీసుకుంటే వారిని వేధించడం, నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు, నినదిస్తే జైల్లో పెట్టడం ఆయన నైజం. భావితరాలకు విలువలతో కూడిన రాజకీయాలను అందించాలనే లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది. బురదలో నుంచి కమలం వికసించినట్లే.. కలుషిత రాజకీయాల నుంచి జనసేన అనే కమలం బయటకు వస్తుంది’ అని పేర్కొన్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో పవన్‌ మచిలీపట్నంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని