Chandrababu: చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్‌ సంభాషణల రికార్డింగ్‌

చంద్రబాబుపై విషం కక్కడమే లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా.. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఆయనపై కొత్త మార్గాల్లో దుష్ప్రచారం చేస్తోందని, అందులో భాగంగా కల్పిత ఫోన్‌ సంభాషణలను ప్రజల్లోకి చొప్పిస్తోందని తెదేపా నేతలు పేర్కొన్నారు.

Updated : 03 Oct 2023 09:08 IST

స్క్రిప్ట్‌, డైరెక్షన్‌ అంతా వైకాపాదే
తెదేపా నేతల మండిపాటు

ఈనాడు, అమరావతి: చంద్రబాబుపై విషం కక్కడమే లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా.. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఆయనపై కొత్త మార్గాల్లో దుష్ప్రచారం చేస్తోందని, అందులో భాగంగా కల్పిత ఫోన్‌ సంభాషణలను ప్రజల్లోకి చొప్పిస్తోందని తెదేపా నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందంటూ ఇద్దరు (యువతి, యువకుడు) మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న వాయిస్‌ రికార్డింగ్‌ను వారు సోమవారం విడుదల చేశారు. ‘2017లోనే అక్రమాలు జరిగాయి. 2018లో ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. దీనంతటికీ ఆయనదే బాధ్యత అని సీఐడీ తమ విచారణలో చెబుతోంది..’ అని అందులోని యువకుడు అన్నట్లుగా.. దానికి యువతి ‘ఇదెక్కడి అన్యాయమన్నా.. మొత్తం దోచేశారు.. ఒక ఆస్తి వచ్చింది లేదు, ఒక విద్యార్ధి బాగుపడింది లేదు. కానీ రూ.371 కోట్లు మాయమయ్యాయి. ఇప్పుడెలా?’ అని చెప్పినట్లుగా ఆ రికార్డింగ్‌లో ఉంది. ‘అదే సీఐడీ విచారణ చేస్తోంది. చంద్రబాబుతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేశారు. నిధులు ఎటు వెళ్లాయో.. దానికి కారకులెవరో వారందరికీ శిక్ష పడేలా చేయాలి’ అని యువకుడు చెబుతున్నట్లు.. ‘అయితే వాళ్లందరినీ పట్టుకోవాలని ఆశిద్దాం.. మనం కష్టపడి సంపాదించిన సొమ్ముకు జవాబుదారీ తనంగా ఉండాల్సిన వాళ్లే దోచేస్తే ఎలా?’ అని యువతి ముగించినట్లుగా రూపొందించారు. ఇది ఇద్దరి మధ్య సాధారణ ఫోన్‌ సంభాషణ కాదని తెదేపా నేతలు స్పష్టం చేశారు. వైకాపా వర్గాలే ఈ స్క్రిప్ట్‌ తయారు చేసి.. అందుకు అనుగుణంగా తమ పేటీఎం బ్యాచ్‌తో మాట్లాడించి వాయిస్‌ రికార్డింగ్‌ల రూపంలో పంపిస్తున్నారని వారు మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు