మా జగన్‌నే తిడతావా అంటూ యువకుణ్ని కుళ్లబొడిచిన దుండగులు

మద్యం ధరల పెరుగుదలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డే కారణమని విమర్శించడమే ఆ యువకుడికి శాపంగా మారింది. దీనికి ఆగ్రహించిన ఇద్దరు దుండగులు అతడిని వెంటాడి దాడికి పాల్పడ్డారు. మన్నించండంటూ వేడుకున్నా కరుణించలేదు.

Published : 03 Oct 2023 04:37 IST

నిందితులు వైకాపా వారని ప్రచారం

మండపేట, న్యూస్‌టుడే: మద్యం ధరల పెరుగుదలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డే కారణమని విమర్శించడమే ఆ యువకుడికి శాపంగా మారింది. దీనికి ఆగ్రహించిన ఇద్దరు దుండగులు అతడిని వెంటాడి దాడికి పాల్పడ్డారు. మన్నించండంటూ వేడుకున్నా కరుణించలేదు. చివరికి దెబ్బలకు తట్టుకోలేక కిందపడిపోవడంతో బాధితుణ్ని వదిలేసి వెళ్లిపోయారు. దాడికి పాల్పడిన వారు వైకాపాకు చెందిన వారని జోరుగా ప్రచారం అవుతోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బాధిత యువకుడు పట్టణంలోని ఒక మద్యం దుకాణం వద్ద సరకు తీసుకుంటున్న సమయంలో.. ధరలు పెరగడానికి కారణం జగనే అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికే మద్యం తాగి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇది విని ద్విచక్ర వాహనంపై ఆ యువకుడిని వెంబడించారు.

కొద్ది దూరం తర్వాత అతడు తమ చేతికి చిక్కడంతో ‘మా జగన్‌ను తిడతావా..’ అంటూ దాడికి పాల్పడ్డారు. బాధితుడు కింద పడిపోయి వేడుకుంటున్నా కాళ్లతో కసితీరా తన్ని వెళ్లిపోయారు. ఈ ఘటనను సమీపంలోని మేడ పైనుంచి ఓ మహిళ చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో సోమవారం ఉదయం మండపేట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దాడి గత నెల 28వ తేదీ రాత్రి జరిగిందని, దాడికి పాల్పడిన వారితో పాటు దెబ్బలు తిన్న వ్యక్తి గురించి విచారిస్తున్నామని ఎస్సై తెలిపారు. మద్యం దుకాణాల వద్ద విచారించినా నిందితులు, బాధితుడికి సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదన్నారు. దాడి చేసిన వ్యక్తులు వెళ్లిన వెంటనే దెబ్బలు తిన్న వ్యక్తి మామూలుగా లేచి వెళ్లిపోయినట్లు తెలిపారు. అయితే సంబంధిత వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు