విభజన హామీల సాధనకు రాష్ట్రవ్యాప్త సభలు

రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదిన్నరేళ్లలో తెదేపా, వైకాపాలు ఏపీని భ్రష్టు పట్టించాయని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు.

Published : 03 Oct 2023 03:57 IST

ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదిన్నరేళ్లలో తెదేపా, వైకాపాలు ఏపీని భ్రష్టు పట్టించాయని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. సేవ్‌ ది నేషన్‌, సేవ్‌ డెమోక్రసీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఈ నెల 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. సోమవారం విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో బహిరంగ సభల గోడపత్రికలు ఆవిష్కరించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలు ఇవ్వగా, తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా వాటిని అమలు చేయకుండా అన్యాయం చేసింది. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన వైకాపా, తెదేపాలు భాజపాకు కొమ్ముకాస్తూ ఏపీకి నష్టం చేస్తున్నాయి. విభజన హామీల అమలు కాంగ్రెస్‌తోనే సాధ్యం. ‘సేవ్‌ ది నేషన్‌, సేవ్‌ డెమోక్రసీ’ నినాదంతో ఈనెల 4న చిత్తూరులో తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. 5న మదనపల్లెలో, 6న కడపలో ఉక్కు కర్మాగారం సాధనకు ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహిస్తామ’ని వెల్లడించారు. ఎస్సై పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ, ఈవెంట్స్‌ తర్వాత చివరి పరీక్షలకు మధ్య 45 రోజులు వ్యవధి ఉండటంతో.. కొందరు అభ్యర్థులకు నష్టం వాటిల్లనుందని, దీనిపై పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దృష్టి పెట్టాలని కోరారు. సమావేశంలో ఏపీసీసీ కార్యనిర్వాహక    అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు, వి.గురునాథం పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని