విజిల్స్‌ వేశారని కేసా? పిలిచి విచారిస్తారా?: లోకేశ్‌

చంద్రబాబుకు మద్దతుగా గుంటూరులో ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో పాల్గొన్న 60 మందిపై కేసులు పెట్టడాన్ని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు.

Published : 03 Oct 2023 04:36 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చంద్రబాబుకు మద్దతుగా గుంటూరులో ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో పాల్గొన్న 60 మందిపై కేసులు పెట్టడాన్ని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. కేసులు పెట్టాలని ఆదేశాలిచ్చినోళ్లకు బుద్ధి లేదు.. వాటిని అమలు చేసిన వారికి ఏమైందని సోమవారం ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ‘‘విజిల్స్‌ వేశారని కేసా? పిలిచి విచారిస్తారా? పోలీసుల తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్టు వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు ధరించారని, చివరికి సైకిల్‌ బ్రాండ్‌ అగరబత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసుపెట్టి.. ఉరిశిక్ష వేసేయండి’’ అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోత మోగిద్దాం’లో పాల్గొన్న 60 మందిపై కేసులు’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తను ట్వీట్‌కు జత చేశారు.

జాతి పిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌శాస్త్రిల జయంతి సందర్భంగా లోకేశ్‌ వారికి నివాళి అర్పించారు. వారి జీవితాల్ని ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కారుకూతలు కూసే వైకాపా వాళ్లపై ఎన్ని కేసులు పెట్టాలి?

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టును తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. కారుకూతలు కూసే సీఎం మొదలు వైకాపా మంత్రులు, నేతలందరిపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలని ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా సోమవారం ప్రశ్నించారు. ‘వై..కామ పార్టీ వారికి బూతులు తిట్టవద్దని హితవు పలికినందుకు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేశారు. వై..కామ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకి మరో చట్టమా? ఇదేం అరాచక పాలన?’ అని నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు