నన్ను ఉరి తీసినా ఆప్‌ను అంతం చేయలేరు

వచ్చే నెల 1వ తేదీన బెయిల్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తిహాడ్‌ జైలుకు తిరిగి వెళ్లేందుకు తనకు ఎటువంటి ఆందోళన లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Updated : 24 May 2024 06:29 IST

తిహాడ్‌ జైలుకు తిరిగి వెళ్లడానికి ఆందోళన లేదు
సీఎం పదవికి రాజీనామా చేసేదీ లేదు: కేజ్రీవాల్‌

దిల్లీ: వచ్చే నెల 1వ తేదీన బెయిల్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తిహాడ్‌ జైలుకు తిరిగి వెళ్లేందుకు తనకు ఎటువంటి ఆందోళన లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం తాను చేస్తున్న పోరాటంలో భాగంగా ఆ నిర్బంధాన్ని భావిస్తున్నానని తెలిపారు. దిల్లీ మద్యం విధాన కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వీలుగా సుప్రీంకోర్టు ఈ నెల 10న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎటువంటి ఆశ లేకుండా నిర్బంధంలో గడిపిన పలువురు స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలే తనను బలోపేతం చేస్తున్నాయని, త్వరలోనే తాను జైలు నుంచి బయటకు వస్తానని కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తనను ఉరి తీసినా ఆప్‌ అంతం కాదని పేర్కొన్నారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎన్నికల బాండ్ల కుంభకోణంపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. అలా చేస్తే అది మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్‌ వంటి ప్రతిపక్ష పార్టీల సీఎంలను లక్ష్యంగా చేసుకోవడానికి భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి స్వేచ్ఛను ఇచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. దిల్లీ ముఖ్యమంత్రిగా జైల్లో నుంచే విధులు నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకుంటానని వెల్లడించారు. 

నా తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకున్నారు 

తనను బలహీనపరిచేందుకు వృద్ధులు, అనారోగ్య బాధితులైన తన తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ ఇలా వ్యవహరించడం ద్వారా ఆయన తన పరిధులన్నింటినీ అతిక్రమించారని విమర్శించారు. గురువారం వర్చువల్‌గా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తన తల్లిదండ్రులను వేధించడం మానుకోవాలని ప్రధానిని కోరానన్నారు.

రాబోయే రోజుల్లో ప్రశ్నించొచ్చు

ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేసిన కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను గురువారం విచారించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నివాసానికి పోలీసులు వెళ్తారని తెలిపాయి. అదే విధంగా కేజ్రీవాల్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని వివరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు