ఫ్లైయాష్‌ తరలింపులో మంత్రి పొన్నం అక్రమాలు: పాడి కౌశిక్‌రెడ్డి

రామగుండంలోని ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్‌ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.

Published : 12 Jun 2024 06:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: రామగుండంలోని ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్‌ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. 32 టన్నుల ఫ్లైయాష్‌ తరలించాల్సిన లారీలో 72 టన్నులు తీసుకెళ్తున్నారని, ఓవర్‌లోడ్‌కు అనుమతించడం ద్వారా రోజుకు రూ.50 లక్షల అవినీతి జరుగుతోందని అన్నారు. ఈ సొమ్మును పొన్నం బంధువు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. భారాస ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో కౌశిక్‌రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 13 లారీలను స్వయంగా నేనే పట్టుకున్నా. రవాణాశాఖ అధికారులు రెండు లారీలనే సీజ్‌ చేసి చేతులు దులిపేసుకున్నారు. మంత్రి ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం’ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించడాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌ విమర్శించారు. ఆగస్టు 15లోగా గ్యారంటీలు అమలు చేసి.. రైతు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావుతోపాటు భారాస ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తామని సవాలు విసిరారు.


ఫ్లైయాష్‌ రవాణాతో మీరెంత సంపాదించారు?: ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే:  మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఖండించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీనియర్‌ నాయకులు కేకే మహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మంగళవారం సెక్రటేరియట్‌ మీడియా సెంటర్‌లో మాట్లాడారు. ‘ఫ్లైయాష్‌ అక్రమ రవాణాతో రోజుకు రూ.50 లక్షలు సంపాదిస్తున్నారంటూ మంత్రిపై ఆరోపణలు చేస్తున్న మీరు పదేళ్లలో ఎంత సంపాదించారు’ అని కౌశిక్‌రెడ్డిని ప్రశ్నించారు. భారాస హయాంలో ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణాతో పదేళ్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ఎన్టీపీసీ లారీలు నిజంగానే ఓవర్‌లోడ్‌తో వెళ్తే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి ఆరోపణల వెనక కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారన్నారు. కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్‌ ద్వారా ఎన్టీపీసీ ఫ్లైయాష్‌ను అమ్ముతున్నారని, అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని