కష్టం ఆయనది.. ఫలితం వారిది

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ ఆ భాగస్వామ్య పక్షాల్లోని శివసేన (యూబీటీ)కు తక్కువ స్థానాలు దక్కడంపై భాజపా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

Updated : 12 Jun 2024 06:41 IST

ఉద్ధవ్‌ ఠాక్రేపై భాజపా ప్రశంసలు
మహారాష్ట్రలో పావులు కదిపే యత్నం

 ముంబయి: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ ఆ భాగస్వామ్య పక్షాల్లోని శివసేన (యూబీటీ)కు తక్కువ స్థానాలు దక్కడంపై భాజపా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేను ప్రశంసిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ)లపై విమర్శలు సంధించింది. ఠాక్రే శ్రమ ఫలితాన్ని ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలు సొంతం చేసుకున్నాయంటూ చురకలు వేసింది. ‘లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోగ్యం సహకరించకపోయినా ఇండియా కూటమి కోసం ఎంతో కృషి చేశారు. కానీ, ఎన్నికల్లో మాత్రం ఆయన పార్టీకి బదులు కాంగ్రెస్, ఎన్సీపీలకే ఎక్కువ ఫలితం దక్కింది. గతంలో ఎన్డీయే కూటమిలో ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని శివసేన 18 స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. ప్రస్తుతం తొమ్మిది సీట్లకే పరిమితమయ్యింది. ఠాక్రే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని భాజపా సీనియర్‌ నేత చంద్రకాంత్‌ పాటిల్‌ అన్నారు. మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇండియా కూటమిలోని పక్షాలతో కుదిరిన అవగాహనలో భాగంగా శివసేన (యూబీటీ) 21 చోట్ల పోటీ చేసి తొమ్మిది స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మిత్రపక్షమైన కాంగ్రెస్‌ 17 స్థానాల్లో బరిలోకి దిగి 13 చోట్ల విజయం సాధించింది. మరో మిత్రపక్షమైన ఎన్సీపీ (ఎస్పీ) పది స్థానాల్లో బరిలోకి దిగి ఎనిమిదింటిని కైవసం చేసుకుంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకి దెబ్బ తగిలింది. 2019 నాటితో పోలిస్తే మహారాష్ట్రలో ఎన్డీయే బలం సగానికి సగం తగ్గింది. భాజపా 9 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఉద్ధవ్‌ను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగా భాజపా పావులు కదుపుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రకాంత్‌ పాటిల్‌ వ్యాఖ్యలు ఈ వ్యూహంలో భాగమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు