రైతులకు భరోసా ఏదీ?

రైతుభరోసా పథకం కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 ఇస్తామన్న హామీ అమలుపై కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేసిందని, డిసెంబరు 9న రైతుభరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు, నీటి మీది రాతలే అని తేలిపోయిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

Published : 13 Jun 2024 04:19 IST

ఎకరానికి రూ.7,500 ఇవ్వడంపై విధాన ప్రకటన చేయాలి: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రైతుభరోసా పథకం కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 ఇస్తామన్న హామీ అమలుపై కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేసిందని, డిసెంబరు 9న రైతుభరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు, నీటి మీది రాతలే అని తేలిపోయిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువైంది. ఇప్పుడు రైతుభరోసాకు విధివిధానాలు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి అని కాంగ్రెస్‌ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రైతుభరోసాకు పరిమితులు పెడతామని, సమీక్ష చేస్తామని ఎన్నికల సందర్భంగా ఎందుకు చెప్పలేదు? ఆరు నెలలుగా సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రిమండలి సమావేశం నిర్వహించి రైతుభరోసాపై తీర్మానం చేసి విధాన ప్రకటన చేయాలి. ఈ వానాకాలం నుంచి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7,500 పథకం అమలు చేయాలి. రైతుకూలీలకు రూ.12,000, కౌలు రైతులకు రూ.15,000 ఇవ్వాలి. రైతుబీమా ఉంచుతారా? ఎత్తేస్తారా? తేల్చిచెప్పాలి’’ అని నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

  • ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నడుచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ఆరోపించారు. తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌ను తెలంగాణ నీటిపారుదలశాఖ సలహాదారుగా నియమించడమే ఇందుకు నిదర్శనమన్నారు. 
  • పౌరసరఫరాల సంస్థలో జరిగిన కుంభకోణంపై ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బియ్యం, ధాన్యం టెండర్లు రద్దు అయ్యాయా లేదా అన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. నిజాలను బయటపెట్టకపోతే త్వరలో భారాస ఆధ్వర్యంలో పౌరసరఫరాల భవన్‌ను ముట్టడిస్తామని చెప్పారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని