భాగవత్‌ జీ! మీ సంరక్షణలోనే లోపం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఇప్పుడు అసంబద్ధమైనదిగా మిగిలిందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

Published : 13 Jun 2024 04:21 IST

మణిపుర్‌పై ఇప్పుడు స్పందించి ఏం లాభం?: కాంగ్రెస్‌ 

దిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఇప్పుడు అసంబద్ధమైనదిగా మిగిలిందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఆ సంస్థ గానీ, దాని అధిపతి మోహన్‌ భాగవత్‌ గానీ అవసరం లేదని పేర్కొంది. మణిపుర్‌ ఘటనలు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై భాగవత్‌ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్‌ఖేడా బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘భాగవత్‌ జీ! మీరు ఏ విత్తనం నాటారో ఆ ఫలాలే మీకు లభిస్తాయి. లోపం మట్టిలో లేదు.. సంరక్షించినవారిలోనే ఉంది. గడ్డకట్టించే చలిలో దేశ రాజధాని వెలుపల రైతులు ఆందోళన చేస్తుంటే మీరు మౌనం వహించారు. హాథ్రస్‌లో దళిత బాలికపై అత్యాచారం చేసి హతమారిస్తే మీరు పెదవి విప్పలేదు. బిల్కిస్‌బానోపై అకృత్యానికి పాల్పడినవారిని జైలు నుంచి విడుదల చేస్తే మీ సైద్ధాంతిక సోదరులు వారిని ఆహ్వానించారు, మీరేమో మౌనం వీడలేదు. దళితులపై మూత్ర విసర్జన, పెహ్లూఖాన్‌-అఖ్లాక్‌ల హత్య, కన్హయ లాల్‌ హంతకులకు భాజపాతో ఉన్న సంబంధం వంటివాటిపైనా మీరు కిమ్మనలేదు. రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు చెబుతున్నప్పుడైనా మీరు అడ్డుకోలేదు. ఇప్పుడు తీరిగ్గా మాట్లాడి ఏం ప్రయోజనం?’ అని ప్రశ్నించారు. 

మోదీ మణిపుర్‌ను సందర్శిస్తారా?: ఉద్ధవ్‌ 

ముంబయి: ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌ సందర్శనకు ప్రధాని మోదీ ఇప్పుడైనా వెళ్తారా అని శివసేన (యూబీటీ) అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశ్నించారు. మణిపుర్‌ గురించి ఆరెస్సెస్‌ అధిపతి భాగవత్‌ కనీసం ఏడాది తర్వాతైనా స్పందించారని, ప్రధాని, హోంమంత్రి అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదా అని విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మణిపుర్, జమ్మూకశ్మీర్‌లను చక్కదిద్దలేకపోతే ప్రధానిగా మూడోసారి కొనసాగే హక్కు మోదీకి ఉండదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని