సంక్షిప్తవార్తలు

మాచర్ల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాల్పడిన నేరాలకు సంబంధించిన నాలుగు కేసులలో ప్రాసిక్యూషన్‌ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ‘స్పెషల్‌ కౌన్సిల్‌’గా నియమించింది.

Updated : 13 Jun 2024 05:52 IST

పిన్నెల్లి కేసులలో వాదనలకు ‘స్పెషల్‌ కౌన్సిల్‌’ నియామకం 

ఈనాడు, అమరావతి: మాచర్ల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాల్పడిన నేరాలకు సంబంధించిన నాలుగు కేసులలో ప్రాసిక్యూషన్‌ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ‘స్పెషల్‌ కౌన్సిల్‌’గా నియమించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి (ఎఫ్‌ఏసీ) జి.విజయ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల సందర్భంగా పాల్వయిగేటులో ఈవీఎంను ధ్వంసం చేయడం, అడ్డుకోవడానికి యత్నించిన తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడిచేయడం, ప్రశ్నించిన ఓ మహిళను బెదిరించడం, కారంపూడి ఇన్‌స్పెక్టర్‌ నారాయణస్వామిపై దాడి చేయడం.. తదితర నేరాల్లో పిన్నెల్లిపై నాలుగు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముందస్తు బెయిలు కోసం ఆయన వేసిన వ్యాజ్యాలు గురువారం హైకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయవాది అశ్వినీకుమార్‌ను రాష్ట్రప్రభుత్వం స్పెషల్‌ కౌన్సిల్‌ను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


హింసాత్మక ఘటనల కట్టడికి ఆదేశించండి
హైకోర్టులో పిల్‌ వేసిన వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను నిరోధించేలా ఆదేశాలు జారీ చేయాలని, దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరగనుంది. 


స్వచ్ఛాంధ్ర సంస్థ ఛైర్‌పర్సన్‌ రాజీనామా ఆమోదం 

ఈనాడు, అమరావతి: స్వచ్ఛాంధ్ర సంస్థ ఛైర్‌పర్సన్‌గా పొనక దేవసేన చేసిన రాజీనామాను ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. గత ప్రభుత్వ హయాంలో ఆమెను ఛైర్‌పర్సన్‌గా నియమించారు. ఎన్నికల్లో వైకాపా ఓటమితో ఈనెల 7న ఛైర్‌పర్సన్‌ స్థానానికి దేవసేన రాజీనామా చేశారు.


 

తెదేపా శ్రేణులు దాడులు చేస్తున్నాయి
కేంద్రానికి వైకాపా ఎంపీల ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ: ఎన్నికల అనంతరం వైకాపా నాయకులు, సానుభూతిపరులపై తెదేపా శ్రేణులు దాడులు చేస్తున్నాయంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలు తెలిపారు. వారు బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఏపీలో ఒకవైపు వైకాపా నాయకులపై దాడులు చేస్తూ.. మరోవైపు వారే తెదేపా వారిపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైకాపా శ్రేణులపై దాడుల గురించి ఫిర్యాదు తీసుకోవడానికి అధికారులు భయపడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో హింస ఇలాగే కొనసాగితే అందుకు భాజపా కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల ఆధారంగానే పార్లమెంటులో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. వైకాపా ఓటమిపై తాము సమీక్షించుకుంటున్నట్లు చెప్పారు. 


ఐదు కోట్ల మంది ఆంధ్రులకు శుభదినం
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు శుభదినమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ‘ఇది మాకు వచ్చిన అధికారం కాదు. ప్రజలిచ్చిన బాధ్యత. ప్రజాసేవనే ముందు.. తర్వాతనే మనం అనేది మా నాయకుడు చంద్రబాబు అభిమతం. మంత్రివర్గం కూర్పులో సీనియర్లకు గౌరవమిస్తూ కొత్తవారికి పదవులు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించారు. రాష్ట్రాభివృద్ధికి సీనియర్ల సలహాలు తీసుకుని మంత్రులందరూ ముందుకు సాగుతారు’ అని పేర్కొన్నారు.


చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడు
కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌

మాట్లాడుతున్న చిరాగ్‌ పాశ్వాన్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని లోక్‌జనశక్తి పార్టీ అధినేత, కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. మంగళగిరిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తన తండ్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చంద్రబాబు సన్నిహితులని, తన తండ్రి బాటలోనే తానూ కొనసాగుతానని చెప్పారు. రానున్న రోజుల్లో లోక్‌జనశక్తి పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తామని పాశ్వాన్‌ తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తుమ్మల శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, రాష్ట్ర నూతన ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


చంద్రబాబుకు స్టాలిన్‌ శుభాకాంక్షలు

చెన్నై, న్యూస్‌టుడే: ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వం ఆంధ్రాకు సంపదను, సంక్షేమాన్ని తీసుకురావాలి. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య స్నేహాన్ని, ఉమ్మడి బంధాన్ని పటిష్ఠం చేసేందుకు ఆసక్తితో నిరీక్షిస్తున్నా’ అని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. బుధవారం ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

అభివృద్ధిపథంలో సాగాలి: అస్సాం సీఎం

గువాహటి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, ఇతర మంత్రులకు నా శుభాకాంక్షలు. ఏపీ ప్రజల ఆశీర్వాదంతో నూతన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తుందని భావిస్తున్నా’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.


 

 

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని