పట్టించుకోని నాయకులకు పదవులెందుకు?

అయ్యా సమస్య వచ్చిందని చెబితే పట్టించుకోని నాయకులకు పదవులు ఎందుకని ఎంపీ అవినాష్‌రెడ్డి ఎదుట కడప వైకాపా కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Published : 13 Jun 2024 05:35 IST

వైకాపా ఎంపీ అవినాష్‌ సమక్షంలో పార్టీ కార్పొరేటర్ల ధ్వజం

కడప నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: అయ్యా సమస్య వచ్చిందని చెబితే పట్టించుకోని నాయకులకు పదవులు ఎందుకని ఎంపీ అవినాష్‌రెడ్డి ఎదుట కడప వైకాపా కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కడపలో పలువురు పార్టీని వీడడానికి సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎంపీ బుధవారం కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాదాపు ప్రతి కార్పొరేటర్‌ ఆ పార్టీ అగ్రనాయకుల వ్యవహారశైలిని తూర్పారబట్టినట్టు తెలిసింది. వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలో ఒక పోస్టును తన మేనల్లుడికి ఇవ్వాలని కోరగా.. రూ.8 లక్షలు డిమాండ్‌ చేశారని ఒక కార్పొరేటర్‌ ఆరోపించారు. రూ.5 లక్షలు ఇస్తామని చెప్పినా ఉద్యోగం ఇవ్వలేదని, వారు డిమాండ్‌ చేసిన మొత్తం ఇచ్చినవారికే కట్టబెట్టారని చెప్పారు. నగర శివారుకు చెందిన ఒక సభ్యుడు మాట్లాడుతూ.. కొండలను, గుట్టలను తవ్వి రూ.కోట్లు గడించారని ఆరోపించారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులకూ 8 శాతం కమీషన్లు వసూలు చేశారని పలువురు విమర్శించారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇలా ఎప్పుడైనా సమావేశాలు నిర్వహించారా? అని ఒక ప్రజాప్రతినిధి నిలదీశారు. సీఎంగా ఉన్నపుడు జగన్‌ను కలవాలంటే ఎన్నో ఆంక్షలను అధిగమించాల్సి వచ్చిందని.. సామాన్య కార్యకర్తలకు ఆయన్ను దూరం చేశారని ధ్వజమెత్తారు.సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి సలహాలతో పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని పలువురు ఆరోపించారు. పార్టీని వీడతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. భూకబ్జాలు, ఇతర అక్రమాలకు పాల్పడిన నాయకులే ఇలాంటి ఆలోచనలు చేస్తారని పలువురు పేర్కొన్నారు. పదవులున్నా, లేకపోయినా వైఎస్సార్‌ కుటుంబంతోనే ఉంటామని మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, జిల్లాస్థాయిలో లీగల్‌సెల్‌ ఏర్పాటుచేస్తామని ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని