ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయి

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.

Updated : 13 Jun 2024 06:30 IST

అంతర్గతంగా సమీక్షించుకుంటాం
సీతారాం ఏచూరి స్పష్టీకరణ

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. సీట్ల విషయంలో అతి స్వల్పంగా మెరుగుపడినా తీవ్రంగా సమీక్షించుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నామని చెప్పారు. లెఫ్ట్‌ తరఫున ఎన్నో ఆందోళనలను నిర్వహించినా ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించకపోవడం నిరాశకు గురి చేసిందని వివరించారు. ఎన్నికల ఫలితాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేరళలో లెఫ్ట్‌ ఓట్లు తగ్గలేదని, కాంగ్రెస్‌ కూటమి ఓట్లను చీల్చడంద్వారా భాజపా ఖాతా తెరిచిందని అభిప్రాయపడ్డారు. 17వ లోక్‌సభలో 5 సీట్లు ఉండేవని, వాటిని ఈ ఎన్నికల్లో 8కి పెంచుకున్నామని తెలిపారు. అయినా సంతృప్తిగా లేమని స్పష్టం చేశారు. రైతుల సమస్యలు, నిరుద్యోగం, ప్రజల జీవన ప్రమాణాలు, నీట్‌ వంటి వాటిపై ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందని చెప్పారు. పార్లమెంటు లోపలా, బయటా వాటిపై ఆందోళనలు చేస్తామని తెలిపారు. భాజపా విభజనవాదం విఫలమైందని, హిందుత్వ కూడా ఫలితాలివ్వలేదని, అందుకు అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో ఆ పార్టీ ఓడిపోవడమే నిదర్శనమని ఏచూరి అభిప్రాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని