ధరలను మోదీ అదుపు చేయలేరు: కాంగ్రెస్‌

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మే నెల ద్రవ్యోల్బణం గణాంకాలపై కాంగ్రెస్‌ పార్టీ గురువారం విరుచుకుపడింది.

Published : 14 Jun 2024 04:57 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మే నెల ద్రవ్యోల్బణం గణాంకాలపై కాంగ్రెస్‌ పార్టీ గురువారం విరుచుకుపడింది. మెజారిటీ లేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద ధరల సంక్షోభానికి పరిష్కారం కూడా లేదని ఎద్దేవా చేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మే నెలలో స్వల్పంగా తగ్గి ఒక ఏడాది కనిష్ఠస్థాయి 4.75 శాతానికి చేరుకున్నట్లు కేంద్రం బుధవారం గణాంకాలు విడుదల చేసింది. ఏప్రిల్‌ నెలలో 8.70 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో స్వల్పంగా తగ్గి 8.69 శాతానికి చేరినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ప్రకటన వెల్లడించింది. దీనిపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందిస్తూ ‘‘మోదీ హైతో మెహంగాయీ హై’’ (మోదీ ఉంటే అధిక ధరలు ఉన్నట్టే) అని వ్యాఖ్యానించారు. ‘‘నాలుగు నెలలుగా ఆహార ధరల ద్రవ్యోల్బణం 8.5 శాతానికి పైగా ఉంది. పప్పులు 10 శాతానికి పైగా ద్రవ్యోల్బణంతో ఏడాదికాలం పూర్తి చేసుకున్నాయి. మే నెలలో ధరలు 17.14 శాతం మేర పెరిగాయి’’ అని ‘ఎక్స్‌’ ద్వారా ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ‘న్యాయ్‌ పత్ర్‌’లో ధరల పెరుగుదల కట్టడికి తాము పరిష్కారాలు చూపినట్లు గుర్తు చేశారు.

రైతులను కాల్చిచంపిన చౌహాన్‌ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రా?

కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయశాఖ కేటాయించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ సీఎంగా ఉన్నపుడు 2017 జూన్‌లో కనీస మద్దతుధర కోసం ఆందోళన చేస్తున్న మందసౌర్‌ రైతులపై పోలీసులు కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఆరుగురు అన్నదాతలు చనిపోయినట్లు జైరాం రమేశ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు వ్యవసాయశాఖ కేటాయిస్తూ ఎన్డీయే సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన సంయుక్త కిసాన్‌మోర్చా (ఎస్‌కేఎం)ను ఆయన అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని