జూనియర్లకు మంత్రి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం: అయ్యన్నపాత్రుడు

‘జూనియర్లకూ మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. వారికి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం. సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం’ అని నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు.

Updated : 14 Jun 2024 12:50 IST

ఈనాడు, అమరావతి: ‘జూనియర్లకూ మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. వారికి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం. సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం’ అని నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. సచివాలయంలో గురువారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం విలేకర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘ఐదుసార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశా.. మిగిలిన వారికీ అవకాశం ఇవ్వాలి కదా? సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేదంటున్నారు.. 25 ఏళ్లకే ఎన్టీఆర్‌ నాకు మంత్రిపదవి ఇచ్చారు. అప్పుడు సీనియర్లు బాధపడ్డారా? మంత్రిపదవి రానివారిని చంద్రబాబు ఓదార్చాలా? మాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడమే గొప్ప.. మళ్లీ ఓదార్పు ఒకటా?’ అని వ్యాఖ్యానించారు. 

ఆ అధికారుల్ని చంద్రబాబు వదిలినా మేం వదలం

‘కొందరు అధికారులు ఓవర్‌గా ప్రవర్తించారు. అందులో పోలీసుశాఖ ఒకటి. అలాంటి వారిని చంద్రబాబు క్షమించినా, మేము క్షమించే ప్రసక్తే లేదు. ఏ కారణం లేకుండానే మా కార్యకర్తల్ని స్టేషన్‌లో కొట్టారు. అలాంటి అధికారుల జాబితా మా దగ్గర ఉంది. కళ్లముందు గొంతు కోస్తుంటే నవ్వుతూ ఉండమంటారా? చట్టపరంగానూ చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. 

ఇది కూటమి విజయం

‘ఇది కూటమి సాధించిన విజయం.. ప్రజలే వైకాపాకు రిటర్న్‌ గిప్ట్‌ ఇచ్చారు. రాష్ట్రం కోసం ఇబ్బంది పడతాం. అవసరమైతే ప్రాణాలిస్తాం. నాకు జీవితాన్నిచ్చింది ఎన్టీఆర్‌. పదిమందికీ పనికొచ్చే పార్టీ ఇది. చంద్రబాబు పాలన ఏంటో త్వరలో మీకే అర్థమవుతుంది’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని