మాది చేతల ప్రభుత్వమని నిరూపించాం

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒకే రోజు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని నిరూపించామని మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎస్‌.సవిత అన్నారు.

Updated : 14 Jun 2024 05:44 IST

మంత్రులు నిమ్మల, బాల వీరాంజనేయస్వామి, సవిత వెల్లడి

ఈనాడు-అమరావతి: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒకే రోజు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని నిరూపించామని మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎస్‌.సవిత అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం రాత్రి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ‘కూటమి తరఫున చంద్రబాబు చెప్పినట్లుగానే హామీలు నెరవేరుస్తున్నారు. నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ ఒక శుభవార్త. జగన్‌ మెగా డీఎస్సీ అని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేశారు. దీంతో రైతులు, ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత, భరోసా లభిస్తుంది’ అన్నారు.రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతోందని, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే జులై 1న పింఛన్లు పంపిణీ చేయిస్తామన్నారు. కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేశారని ఆ విషయం ఏం చేయాలనేది సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ జగన్‌ హయాంలో పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచడానికి ఐదేళ్లు పడితే తమ ప్రభుత్వంలో చంద్రబాబు ఒక్క రోజులోనే రూ.వెయ్యి పెంచారన్నారు. మరో మంత్రి ఎస్‌.సవిత మాట్లాడుతూ రానున్న ఐదేళ్ళూ రాష్ట్రానికి స్వర్ణయుగమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని