మహారాష్ట్రపై పట్టుకు గట్టి ప్రయత్నం

మహారాష్ట్రపై పూర్తి పట్టు సాధించేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ గురువారం తెలిపారు.

Published : 14 Jun 2024 05:03 IST

అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: శరద్‌ పవార్‌

పుణె: మహారాష్ట్రపై పూర్తి పట్టు సాధించేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ గురువారం తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పక విజయం సాధిస్తేనే అది సాధ్యమవుతుందని అన్నారు. ఎన్సీపీలో చీలిక ఏర్పడినా లోక్‌సభ ఎన్నికల్లో 10 చోట్ల పోటీచేసి 8 స్థానాలు దక్కించుకొని శరద్‌ పవార్‌ సత్తా చాటారు. కుటుంబ పోరుకు వేదికగా మారిన బారామతి స్థానాన్ని ఆయన కుమర్తె సుప్రియా సూలె వరుసగా నాలుగోసారి తిరిగి నిలబెట్టుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బారామతి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ సమావేశాలు నిర్వహిస్తున్న శరద్‌ పవార్‌ అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శిరసుఫల్‌ గ్రామస్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..‘‘ఎన్నికల సమయంలో బారామతి ప్రజలు మౌనంగా ఉన్నారని.. బహిరంగంగా ఏమీ మాట్లాడటం లేదని పార్టీ కార్యకర్తలు నాతో చెప్పారు. ప్రజలు ఈవీఎంలలో సరైన బటన్‌ నొక్కుతారని.. ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు చెప్పా. చివరకు నేను అనుకున్నదే జరిగింది. ఈవీఎంలు తెరిచిచూస్తే.. ఓటర్లు చేసిన మ్యాజిక్‌ కనిపించింది’’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయనీ, రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. నాలుగు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, పన్నెండేళ్లు కేంద్రమంత్రిగా పనిచేసిన శరద్‌ పవార్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అనుచితమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు