హింసాత్మక ఘటనలకు వైకాపా వాళ్లే బాధ్యులు

పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా అనేక మంది తెదేపా కార్యకర్తల్ని కిరాతకంగా చంపడం దారుణం కాదా? అని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.

Published : 14 Jun 2024 05:08 IST

తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజం

ఈనాడు డిజిటల్, అమరావతి: పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా అనేక మంది తెదేపా కార్యకర్తల్ని కిరాతకంగా చంపడం దారుణం కాదా? అని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. తన అక్కను వేధించొద్దన్నందుకు అమర్‌నాథ్‌గౌడ్‌ అనే బాలుడిపై పెట్రోలు పోసి చంపడం, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడం, తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టడం అరాచకం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా వాళ్లు దాడులు చేస్తున్నారంటూ వైకాపా నాయకులు దిల్లీ వెళ్లి మరీ అసత్యప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు వైకాపా పుట్టిందే శవ రాజకీయాల్లోంచని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘అయిదేళ్ల పాలనలో జగన్‌ చేయని అరాచకం, ఘోరం, దుర్మార్గం లేదు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. మాస్క్‌ అడిగిన పాపానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డా.సుధాకర్‌ను పిచ్చోడిని చేసి వైకాపా వాళ్లు బలితీసుకున్నారు. పోలింగ్‌ తర్వాత మాచర్ల, తాడిపత్రి, తిరుపతిలో పెద్ద ఎత్తున  హింసను ప్రేరేపించారు. ఇవన్నీ వైకాపా వాళ్లు చేసిన దారుణాలు. వీటిని కప్పిపెడుతూ...తెదేపా వాళ్లపై నిందలు వేయడం మానుకోవాలి’’ అని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని