ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా

రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. స్టాన్‌ఫర్డ్‌లో చదువుకొన్న తనకు గ్రామీణ విద్యావ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 15 Jun 2024 06:22 IST

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తా
ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి : రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. స్టాన్‌ఫర్డ్‌లో చదువుకొన్న తనకు గ్రామీణ విద్యావ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవవనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్స్‌ వేదికగా శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ‘నాడు పల్లె సేవే.. పరమాత్ముడి సేవగా భావించి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖల్ని మార్చాను. ఐటీ మంత్రిగా అనేక కంపెనీలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాను. గత అనుభవాలు నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్థంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుంచి పీజీ వరకూ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానన్న హామీని నెరవేరుస్తాను’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

 ఒక్క సంతకంతో పింఛన్‌ను రూ.15 వేలు చేశారు 

 తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న వారి పింఛన్‌ను ఒక్క సంతకంతో రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ కొనియాడారు. పేదలపై ప్రేమ చూపడమంటే ఇదని పేర్కొన్నారు. ఒకాయన ముక్కుతూ.. మూలుగుతూ దశల వారీగా వెయ్యి రూపాయలు పెంచడానికి అయిదేళ్లు తీసుకున్నారని మాజీ సీఎం జగన్‌ను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు ఒక్క సంతకంతో.. రూ.3 వేల వృద్ధాప్య పింఛన్‌ను రూ.4 వేలకు పెంచారు. దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలకు, కిడ్నీ బాధితుల పింఛన్‌ను రూ.పది వేలకు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి పింఛన్‌ను రూ.15 వేలకు పెంచారు. సంక్షేమం అంటే ఇది’’ అని ‘ఎక్స్‌’లో లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని